న్యూఢిల్లీ : ప్రయివేటు రంగ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో హెచ్‌డిఎఫ్‌సి విలీనం విజయవంతంగా పూర్తి అయ్యిందని ఆసంస్థ తెలిపింది. అవసరమైన అందరు వాటాదారులు, నియంత్రణ సంస్థల అనుమతులు పొందిన తరువాత జులై 1వ తేది నుంచి అమల్లోకి వచ్చిందని తెలిపింది. దీన్ని 2022 ఏప్రిల్ 4న ప్రకటించినప్పటికీ.. అన్ని ప్రక్రియలు నాటికి ముగిశాయి. రెండు కంపెనీల బోర్డులు శుక్రవారం నిర్వహించిన సమావేశాలలో విలీనం జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నాయి. దీంతో రూ.18 లక్షల కోట్ల ఆస్తులతో ఒక దిగ్గజ సంస్థ ఏర్పాటు అయ్యింది. విలీనం అనంతరం 12 కోట్ల కస్టమర్లు, 8,300 బ్యాంకు శాఖలు, 1.77 లక్షల మంది ఉద్యోగులతో కూడిన అతిపెద్ద బ్యాంకుగా ఆవిర్భవించింది. విలీన సంస్థ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌గా కొనసాగనుంది. ''ఇది మా ప్రయాణాన్ని నిర్వచించే సంఘటన, మా సంయుక్త శక్తి ఆర్థిక సేవల సమగ్ర పర్యావరణ వ్యవస్థను రూపొందించేందుకు మాకు సహాయపడుతుందని నేను విశ్వసిస్తున్నాను.'' అని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సిఇఒ, ఎండి శశి జగదీషన్ పేర్కొన్నారు.










