Jul 19,2023 08:02
  • భీమవరం ప్రాజెక్టులో స్థానికేతరులకు పోస్టులు
  •  అధికారుల తీరుపై విమర్శల వెల్లువ

ప్రజాశక్తి- భీమవరం రూరల్‌ : స్త్రీ, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు, హెల్పర్ల పోస్టుల నియామకంలో అధికారులు జిమ్మిక్కులు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పోస్టుల భర్తీలో విద్యార్హత, వయస్సుతోపాటు స్థానికులకు పోస్ట్లు కేటాయించాలనేది నిబంధన. అయితే ప్రభుత్వ నిబంధనలకు నీళ్లొదిలిన భీమవరం ప్రాజెక్టు అధికారులు ఇష్టానుసారం నియామకాలు చేపడుతున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి విచారణ చేపడితే పోస్టులు స్థానికులకే కేటాయించారా, లేక ఇతర ప్రాంతాల వారితో భర్తీ చేశారా అనేది వెలుగులోకి వస్తుందని పలువురు చెబుతున్నారు. ప్రాజెక్టు పరిధిలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పలువురు అంగన్‌వాడీ పోస్టుల భర్తీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. అంగన్వాడీ పోస్టుల భర్తీకి ప్రకటన రాగానే పలువురు సంబంధిత పత్రాలు తీసుకుని ఒకటికి రెండుసార్లు ప్రాజెక్టు కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగి దరఖాస్తులు అందిస్తున్నారు. అయితే అంగన్వాడీ పోస్టుల భర్తీలో రాజకీయ పలుకుబడితోపాటు పెద్దఎత్తున సొమ్ము ముట్టజెప్పే వారికే అవకాశం దక్కుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాజెక్టు అధికారులు కాసులకు కక్కుర్తిపడి ఖాళీ అయిన పోస్టుల వివరాలను బట్టి ఫలానా వార్డులో కార్యకర్త లేదా హెల్పర్‌ పోస్టు ఉంటుందని ముందుగానే రికమండేషన్‌ అభ్యర్థులకు తెలియజేస్తున్నట్లు సమాచారం. దీంతో వారు ఆ ప్రాంతంలోని ఏదోక డోర్‌ నెంబర్‌కు ఆధార్‌ మార్చుకోవాలని సూచిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యి అన్నీ సిద్ధం చేసుకున్నాక భర్తీ ప్రక్రియ తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కొత్త పోస్టుల్లో భీమవరం అర్బన్‌కు చెందిన ఒక హెల్పర్‌కు కార్యకర్త పోస్టు ఇచ్చేందుకు ప్రాజెక్టు అధికారులు ముందుగానే ఆమెచే రిజైన్‌ చేయించి అన్నీ సిద్ధం చేసినట్లు సమాచారం. ఆమె కంటే కొందరు సీనియర్‌ హెల్పర్లు ఉన్నప్పటికీ ఆమెకు మాత్రం నేరుగా కార్యకర్త పోస్టు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భీమవరం అర్బన్‌ పరిధిలోని వేరే వార్డులో ఉన్న అంగన్వాడీ సెంటర్లో కార్యకర్త పోస్టు ఖాళీ కావడంతో ఆమె ఆధార్‌ అడ్రస్‌ను ముందుగానే ఆ ప్రాంతానికి మార్చుకోవాలని అధికారులే ఆమెకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.