ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ప్రతిపక్షాన్ని అణచివేసేందుకు కుట్ర జరుగుతోందని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టిన అరెస్టు చేశారని పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో టిడిపి ఎంపిలతో కలిసి మంగళవారం ఆయన కలిశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేయడంతోపాటు, స్కిల్ స్కామ్ కేసుకు సంబంధంచి తమవద్ద ఉన సమాచారాన్ని అందచేశారు. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికార దుర్విని యోగం జరుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమ అరెస్టులతో ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు సాధిస్తోందని తెలిపారు. పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని అక్రమ కేసులతో నిరంతరం తమ పార్టీ నాయకులను అరెస్టులు చేస్తున్నారని తెలిపారు. తమ పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు వివిధ చోట్ల తమ కార్యాల యాలపై దాడులు నిర్వహించారని వివరించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ ఎంపిలు కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయ దేవ్, కేశినేని నాని, కింజరపు రామ్మోహన్ నాయుడు మరో వినతిపత్రాన్ని రాష్ట్రపతికి అందజేశారు.
6 నెలల్లో జగన్‌కు రిటర్న్ గిఫ్ట్: లోకేష్
చంద్రబాబును అక్రమ అరెస్టు చేసి జగన్ తమకు గిఫ్ట్ ఇచ్చారని లోకేష్ విమర్శించారు.. ఆరు నెలల్లో జగన్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యత వ్యక్తిగతం గా తానే తీసుకుంటానని చెప్పారు. రాష్ట్రపతితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు, ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులతో తనకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. రిండ్‌రోడ్డు లేకపోయినా కేసు ఎలా పెట్టారో అర్ధం కావడం లేదన్నారు. రోజుకో వదంతి, తప్పుడు కేసులతో ప్రతిపక్షాన్ని వేధిస్తున్నారని తెలిపారు. యువగళం పాదయాత్ర ప్రారంభించేందు కు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి అనుమతులు కోరామన్నారు. వెంటనే తన పేరును రింగ్‌రోడ్డు కేసులో చేర్చారని చెప్పారు.










