- 2022 పాలసీ తెస్తున్న కేంద్రం
- ఒకే తరహాపై కొన్ని రాష్ట్రాల విముఖత
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : పలు ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకునే రుణాలపై రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్యారంటీలపై కేంద్రం ఉక్కుపాదం మోపనుంది. గ్యారంటీల పాలసీ-2022ను అమలు చేయడం ద్వారా గ్యారంటీలను కట్టడి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలతో పాలసీపై చర్చలు కూడా నిర్వహిస్తోంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలతో ఇప్పటికే రెండు విడతలుగా చర్చలు నిర్వహించిన కేంద్రం, రిజర్వ్‌బ్యాంకులు పలు నిర్ణయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఏక రూప గ్యారంటీ విధానాన్ని అమలు చేసే అంశంపై కొన్ని రాష్ట్రాలు విముఖత వ్యక్తం చేస్తుండగా, మిగిలిన అంశాలపై మాత్రం సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్యారంటీలు ఇవ్వరాదన్న విధానాన్ని అమలు చేయనున్నారు. గ్యారంటీ అన్నది ఒక విధానంలా కాకుండా రుణం తీసుకున్న సంస్థ తరఫున భవిష్యత్తులో తిరిగి చెల్లించేలా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రాలు తీసుకునే గ్యారంటీలపై ప్రస్తుతం ఎటువంటి నిషేధం, పరిమితి లేకపోయినప్పటికీ, త్వరలోనే కొంత పరిమితి విధించాలన్న కోణంలో కసరత్తు చేస్తున్నారు. జిఎస్‌డిపి లేదా సొంత ఆదాయాల్లో నిర్దిష్ట శాతం మేరకే గ్యారంటీలు ఇవ్వాలన్న విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. దీనికి దాదాపుగా అన్ని రాష్ట్రాలు అంగీకరించడం విశేషం. అలాగే మార్కెట్ రుణాల ద్వారా, గ్యారంటీల ద్వారా తీసుకునే రుణాలు మొత్తం జిఎస్‌డిపి పరిధిలోనే ఉండేలా చూడాలన్న విధానానికి కూడా కొన్ని రాష్ట్రాలు అంగీకరించినట్లు తెలిసింది. అయితే ఒక్క ఒడిశా మాత్రం తమకు ఏకరూప విధానం సరిపడదని తిరస్కరించడం విశేషం.
సంస్థలకు ఇచ్చే గ్యారంటీల కారణంగా తలెత్తే ప్రమాద సూచికలపైనా కీలక చర్చ జరుగుతుండడం గమనార్హం. 100 శాతం రిస్క్ లేని విధంగానే గ్యారంటీలు ఉండాలని రిజర్వ్‌బ్యాంకు స్పష్టం చేస్తోంది. ప్రభుత్వాలు ఇచ్చే గారంటీల వివరాలను ఇండియన్ గవర్నమెంట్ అకౌంటింగ్ స్టారడర్స్ మేరకు తప్పనిసరిగా బహిరంగంగా ప్రకటించాలని కూడా రిజర్వ్‌బ్యాంకు తేల్చిచెబుతోంది. కేంద్రం తయారుచేస్తున్న 2022 పాలసీ తరహాలోనే రాష్ట్రాల్లో కూడా గ్యారంటీ పాలసీలు తయారుచేసుకోవాలని రిజర్వ్‌బ్యాంకు స్పష్టం చేస్తోంది. ఈ విధానాలన్నీ పాటిస్తే రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీల ద్వారా సేకరించే రుణాలు కష్టంగా మారుతాయని అధికారులు అంటున్నారు.










