ప్రజాశక్తి- నందిగామ(ఎన్‌టిఆర్‌జిల్లా) : అంబారుపేట గ్రామంలో వాలంటీర్ల అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో గురువారం అంబారుపేట సచివాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నందిగామ మండల నాయకులు సయ్యద్ ఖాసిం, కటాపు గోపాల్ మాట్లాడుతూ వైఎస్‌ఆర్ చేయూత పధకం కింద 600 రూపాయలు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. లబ్ధిదారుల వద్ద నుండి వైయస్సార్ చేయూత పథకం కోసం కుల దృవీకరణ, ఆదాయ దృవీకరణ పత్రాల కోసం 600 రూపాయలు ఇవ్వాలని లేని పక్షంలో చేయూయ పథకం రాదని బెదిరిస్తున్నారన్నారు. డబ్బులు ఎందుకు ఇవ్వాలని లబ్ధిదారులు అడిగితే మా పై అధికారులకు మామూలు ఇవ్వాలని వాలంటీర్లు అంటున్నారని, దీంతో అంబారుపేట గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే వాలంటీర్ అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబారుపేట సిపిఎం నాయకులు కందుకూరి రాజేష్, సిపిఎం నాయకులు నరుకుళ్ళ నాగేశ్వరావు, కర్రీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










