- రేపటినుంచి భారత్-ఆస్ట్రేలియా డబ్ల్యుటిసి ఫైనల్
లండన్ : లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్(డబ్ల్యుటిసి) జూన్ 7 నుంచి ప్రారంభంకానుంది. ప్రతిష్ఠాత్మక డబ్ల్యుటిసి ఫైనల్ ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యుటిసి) ఆరంభ సీజన్‌లో భారతజట్టు ఫైనల్‌కు చేరినా న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఆ సీజన్ రెండేళ్లలో భారతజట్టు ఆడిన టెస్టులో సంచలన విజయాలను నమోదు చేసుకొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కానీ రెండోస్థానంలో ఉన్న న్యూజిలాండ్ చేతిలో భారత ఓటమిని ఇప్పటికీ మరువలేకపోతోంది. ఇంగ్లండ్‌లోని లండన్ వేదికగా జరిగిన డబ్ల్యుటిసి గద కోసం జరిగిన ఫైనల్లో భారతజట్టు మూడున్నర రోజుల్లోనే ఓటమిపాలైంది. అప్పటి ఫైనల్లో భారత్ 8వికెట్ల తేడా ఓటమిపాలు కాగా.. ట్రోఫీని న్యూజిలాండ్ ఎగరేసుకుపోయింది. మళ్లీ రెండేళ్లపాటు 2022-23 సీజన్‌కు జరిగిన సిరీస్‌లలోనూ భారత్ 2వ స్థానంలో నిలిచి వరుసగా రెండోసారి డబ్ల్యుటిసి ఫైనల్‌కు చేరి రికార్డు నెలకొల్పింది. ఆస్ట్రేలియా జట్టు 66.67పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా.. భారతజట్టు 58.8పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరింది. టీమిండియా బ్యాటర్లలో మిడిలార్డర్ బ్యాటింగ్ బాధ్యతలను అజింక్యా నిర్వర్తించాల్సి ఉంది. ఇటీవలికాలంలో రహానే అద్భుత ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసి రానుంది. 2022లో ముంబయిలో ఆస్ట్రేలియాపై రహానే సెంచరీతో కదం తొక్కాడు. ఆ తర్వాత 2022-23 రంజీట్రోఫీ సీజన్‌లోనూ 2సెంచరీలతో, అద్భుత స్ట్రయిక్‌రేట్‌తో ఆకట్టుకున్నాడు.
- ముగ్గురు పేసర్లు.. ఇద్దరు స్పిన్నర్లతో..
ఇంగ్లండ్ పిచ్‌లు పేస్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. దీంతో భారత్ ముగ్గురు ప్రధాన పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశముంది. ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్‌తోపాటు మరో ఆల్‌రౌండర్ జట్టులో చేరనున్నట్లు బిసిసిఐ అధికారి ఒకరు తెలిపారు. భారత్ ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందని.. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను తుది జట్టులోకి తీసుకుంటుందని ఆయన తెలిపారు. రవీంద్ర జడేజా బ్యాటింగ్ ఆర్డర్‌లో ఆరో స్థానాన్ని నిలబెట్టుకోగలడు. అతని బ్యాటింగ్ ఎంతగానో మెరుగుపడింది. బౌలింగ్ కూడా చేస్తాడు. కాబట్టి.. అతనిని జట్టులోకి తీసుకుంటుందని అనుకుంటున్నా. జడేజా కంటే అశ్విన్ చాలా నైపుణ్యమున్న, మెరుగైన టెస్ట్ బౌలర్ అనడంలో సందేహం లేదు. లోయర్ ఆర్డర్‌లో జడేజా బ్యాటింగ్‌లో రాణిస్తే ఆట నాలుగు లేదా ఐదో రోజు వరకు వెళ్లొచ్చు. అలా కాకుండా పిచ్ స్పిన్‌కు అనుకూలంగా మారితే భారత్‌కు రెండో స్పిన్నర్‌గా జడేజా రూపంలో మంచి బౌలర్ ఉంటాడని ఆయన అన్నారు.










