భువనేశ్వర్ : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం దుర్ఘటనలో మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. మార్చురీల వద్దే భారీ సంఖ్యలో మృతదేహాలు కనిపించాయి. ఈ ప్రమాదంలో మతి చెందినవారి కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం శోకసంద్రాన్ని తలపిస్తున్నది. రైలు ప్రమాద తీవ్రతకు అనేక మృతదేహాలు ఛిద్రమైన స్థితిలో గుర్తుపట్టలేనివిగా మారాయి. దీంతో మార్చురీల వద్ద భారీగా పేరుకుపోయిన మృతదేహాలను భద్రపరచడం ఒడిశా అధికార యంత్రాంగానికి పెను సవాల్‌గా తయారైంది. గుర్తు తెలియని మృతదేహాలే భారీ సంఖ్యలో ఉండటంతో అధికారులు బాలేశ్వర్ నుంచి భువనేశ్వర్‌కు 187 మృతదేహాలను తరలించారు. అయితే, వీటిని భద్రపరిచేందుకు శవాగారాల్లో స్థలం లేకపోవడంతో సమస్యగా మారింది. దీంతో మృతుల బంధువులు గుర్తించేలా తగిన ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టిసారించింది.
భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు 110 మృతదేహాలు తరలించగా.. మిగతా వాటిని కాపిటల్ ఆస్పత్రి, అమ్రి ఆస్పత్రి, సమ్ ఆస్పత్రి సహా పలు ప్రయివేటు ఆస్పత్రులలో భద్రపరిచారు. అయితే, ఎయిమ్స్‌లో గరిష్ఠంగా 40 మృతదేహాలను మాత్రమే ఉంచేందుకు సౌలభ్యం ఉన్నందున ఇంత భారీ సంఖ్యలో వచ్చిన శవాలను భద్రపరిచడం అత్యంత సవాల్ అని అక్కడి అధికారి ఒకరు తెలిపారు. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు, బంధువులు గుర్తించే వరకు భద్రపరిచేందుకు శవపేటికలు, ఐస్, ఫార్మాలిన్ రసాయనాలను సేకరిస్తున్నారు.
ఆయా వెబ్‌సైట్‌లలో మృతుల ఫొటోలు, వివరాలు : ఒడిశా సీఎస్
మృతదేహాలను బంధువులు, కుటుంబ సభ్యులు గుర్తించేందుకు సులభంగా ఉండేలా మృతుల వివరాలు, ఫొటోలను ఆయా వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచుతామని ఒడిశా సీఎస్ ప్రదీప్ జెనా తెలిపారు. ఫొటోలు చూడటానికి ఇబ్బందికరమైన రీతిలో ఉన్నప్పటికీ ప్రమాదం తీవ్రత, ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వాటిని గుర్తించడం కోసమే పోస్ట్ చేస్తున్నామన్నారు. అయితే, ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ రాతపూర్వక అనుమతి లేకుండా ఎవరూ ఈ ఫొటోలను ప్రచురించడానికి వీల్లేదని ఉన్నతాధికారులు చెప్పారు. భువనేశ్వర్‌లోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని సంప్రదించి మతదేహాల సమాచారం పొందొచ్చని సూచించారు.










