ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రిమాండ్‌లో వున్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడును కస్టడీకి ఇవ్వాలన్న సిఐడి పిటీషన్, చంద్రబాబునాయుడి బెయిల్ పిటిషన్‌పై విచారణను ఎసిబి కోర్టు గురువారానికి వాయిదా వేసింది. బుదవారం విజయవాడలోని ఎసిబి కోర్టులో చంద్రబాబునాయుడి తరుపున సుప్రీం కోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే, సిఐడి తరుపున ఎఎజి పొన్నువోలు సుదాకర్‌రెడ్డి వాదనలను వినిపించారు. ఇరువర్గాల వాదనలను విన్న ఎసిబి కోర్టు గురువారం ఉదయం 11.15 గంటలకు మిగిలిన వాదనలను వింటామని ప్రకటించింది. అంతకుముందు చంద్రబాబునాయుడుకు బెయిల్ ఇవ్వొద్దని, కస్టడీకి అనుమతించాలంటూ ప్రభుత్వం తరఫున ఎఎజి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. ఈ కేసులో చంద్రబాబునాయుడుకు 17ఎ వర్తించదని అన్నారు. చంద్రబాబునాయుడి పిఎ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ విదేశాలకు పరారయ్యారని పొన్నువోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు. వాళ్లిద్దరూ ఐటి దర్యాప్తులో ఉన్నవాళ్లేనా కోర్టు సిఐడి న్యాయవాదిని ప్రశ్నించింది. స్కిల్ కేసులో చంద్రబాబునాయుడితో ఆర్థిక లావాదేవీలు జరపటంతోనే వాళ్లిద్దరూ విదేశాలకు వెళ్లారని పొన్నవోలు సుదాకర్‌రెడ్డి తెలిపారు. ఈ కేసులో వాంగ్మూలం ఇచ్చిన ఆర్థిక కార్యదర్శి పివి రమేష్ మాట మార్చారని మీడియాలో వేరే విధంగా చెబుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ దశలో చెప్పిందే చెబుతున్నారని ఎఎజి పొన్నువోలు సుధాకర్‌రెడ్డి పై న్యాయమూర్తి కొంత అసహనం వ్యక్తం చేశారు. నిధుల దుర్వినియోగం ఎలా జరిగిందో చెప్పాలని ప్రశ్నించింది. . స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబునాయుడి వైపు ఎలాంటి తప్పిదాలు లేవని ప్రమోద్‌కుమార్ దుబే వాదించారు. ఆర్థికశాఖ ఉన్నతాధికారి సునీత గుజరాత్ వెళ్లి అధ్యయనం చేశారు. ఆమె అధ్యయనం చేశాక సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరం తెలపలేదన్నారు. ఎలాంటి అభ్యంతరం లేకుండా ప్రాజెక్టు ఆమోదం పొందిందన్న ఆధారాలు ఉన్నాయని తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు కాస్ట్ ఎవాల్యుయేషన్ కమిటీ ప్రాజెక్టు ఎక్విప్‌మెంట్ ధరను నిర్ధారించిందని, ఆ కమిటీలో చంద్రబాబునాయుడు లేరని కోర్టు దృష్టికి తెచ్చారు. ఎవాల్యుయేషన్ కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్నారన్నారు. సుప్రీంకోర్టు నవంబర్ 16 వరకు ఆయన బెయిల్‌ను పొడిగించిందని తెలిపారు. చంద్రబాబునాయుడుకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేసి ఆ తర్వాత విచారణ చేపట్టారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వాదనల అనంతరం మద్యహ్నానికి వాయిదా వేశారు. భోజన విరామం అనంతరం ప్రభుత్వం తరఫున ఎఎజి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలను కొనసాగించారు.స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మొత్తం వ్యవహారం అంతా చంద్రబాబునాయుడు చుట్టూనే వుందని కోర్టు దృష్టికి తెచ్చారు. ముద్దాయిలందరికీ ఏదో ఒక స్థాయిలో ఈ కార్పొరేషన్ ద్వారా వ్యక్తిగత లబ్ధి చేకూరిందన్నారు. 2018లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ హెచ్చరికల నేపథ్యంలో కంటితుడుపు విచారణకు ఆదేశించిందన్నారు. ఆ విచారణ అనంతరం కేసును బుట్ట దాఖలు చేశారని తెలిపారు. సామాజిక, ఆర్థిక నేరాల్లో బెయిల్ ఇవ్వొద్దని సుప్రీంకోర్టు తీర్పులున్నాయని చెప్పారు. ఇరువైపుల వాదనలు విన్న ఎసిబి కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది.










