Jul 01,2023 21:54

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వానికి పన్ను ఆదాయాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఏడాది జూన్‌లో 12 శాతం వృద్థితో రూ.1.61 లక్షల కోట్ల వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లయ్యింది. గతేడాది జూన్‌లో రూ.1.44 లక్షల కోట్లు వసూళ్లు నమోదయ్యాయి. 2017 జులైలో ఈ పన్ను విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత నాలుగో సారి రూ.1.60 లక్షల కోట్ల మార్క్‌ను నమోదు చేసింది. ఆర్థిక సంవత్సరం (2021-22) ఏప్రిల్‌ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసిక కాలంలో సగటున నెలకు రూ.1.10 లక్షల కోట్లు, 2022-23లో అదే సమయంలో రూ.1.51 లక్షల కోట్లు, 2023-24లో మొదటి త్రైమాసికంలో రూ.1.69 లక్షల కోట్లకు జిఎస్‌టి వసూళ్లు పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన జూన్‌లో రూ.1,61,497 కోట్లు వసూళ్లు నమోదయ్యాయి. ఇందులో సిజిఎస్‌టి కింద రూ.31,013 కోట్లు, ఎస్‌జిఎస్‌టి కింద రూ.38,292 కోట్లు, ఐజిఎస్‌టి కింద రూ.80,292 కోట్లు చొప్పున వసూళ్లయ్యాయి. గడిచిన నెలలో తెలంగాణలో 20 శాతం వృద్థితో రూ.4,681.39 కోట్ల పన్ను వసూళ్లు జరిగాయి. గతేడాది ఇదే నెలలో రూ.3,901.45 కోట్ల జిఎస్‌టి వసూళయ్యింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో రూ.2,986.52 కోట్లు వసూళ్లు చోటు చేసుకోగా.. ఈ ఏడాది జూన్‌లో 16 శాతం పెరిగి రూ.3,477.42 కోట్లకు చేరాయి.