Jun 14,2022 07:16

- పాలకులను విమర్శించినా, నిరసన తెలిపినా జైల్లో పెడుతున్నారు : కానిస్టిట్యూషనల్‌ కాండక్ట్‌ గ్రూప్‌
న్యూఢిల్లీ :  మోడీ సర్కార్‌ హయాంలో నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారని, ప్రభుత్వాన్ని..పాలకులను విమర్శిస్తే దేశద్రోహం కింద అరెస్టులు చేస్తున్నారని మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, కేంద్ర సర్వీస్‌లో పనిచేసిన ఉద్యోగుల సంఘం (కానిస్టిట్యూషనల్‌ కాండక్ట్‌ గ్రూప్‌ - సీసీజీ) ఆందోళన వ్యక్తం చేసింది. భారత రాజ్యాంగంలో ప్రాథమిక నియమావళికి వాక్‌ స్వాతంత్య్రం ఆధారమని సీసీజీ ఒక ప్రకటనలో పేర్కొన్నది. దేశద్రోహ చట్టంలోని సెక్షన్‌ 124ఏను పాలకులు దుర్వినియోగం చేస్తున్నారని తెలిపింది. బ్రిటిష్‌ వలసపాలన నాటి దేశద్రోహ చట్టాన్ని ఇష్టానుసారంగా వాడటం కుదరదని సుప్రీంకోర్టు నెలరోజుల క్రితం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సెక్షన్‌ కింద ఎక్కడా కూడా కొత్త కేసులు నమోదుచేయరాదని, సెక్షన్‌ 124ఏ చెల్లుబాటుపై పున:సమీక్ష చేస్తున్నామని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపింది. అయితే ఈ వ్యవహారంపై సీసీజీ తాజాగా మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. ''సెక్షన్‌ 124ఏ ఉండొచ్చు. లేకపోవచ్చు. దీనివల్ల సామాన్య పౌరుడి వాక్‌ స్వాతంత్య్రం హక్కులో పెద్దగా మార్పు వస్తుందని అనుకోలేం. ఎందుకంటే పాలకుల విధానాలు మారాలి. సెక్షన్‌ 124ఏ లేకుంటే..మరో చట్టంతో, ఇంకేదో సెక్షన్‌తో అరెస్టులు కొనసాగుతాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1) ప్రకారం వాక్‌స్వాతంత్య్రం అందరి హక్కు. నిరసన, విమర్శ చేసే హక్కు అందరికీ ఉంది.

ఇష్టానుసారంగా అరెస్టులు చేస్తూ, జైల్లో నిర్బంధిస్తూ పాలకులు రాజ్యాంగంలో ప్రాథమిక నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు'' అని సీసీజీ పేర్కొన్నది. రాజకీయ ప్రతీకారానికి, కక్షసాధింపునకు, బెదిరింపులకు, నిరసన గళాన్ని అణచివేయడానికి సెక్షన్‌ 124ఏను మోడీ సర్కార్‌ అనేకమార్లు ప్రయోగించింది. గత కొన్నేండ్లుగా ఈ సెక్షన్‌ దుర్వినియోగం అవుతోందని పౌర హక్కుల సంఘాల నాయకులు, ప్రతిపక్ష నేతలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక (ఉపా) చట్టాం1967ను కూడా పాలకులు దుర్వినియోగం చేస్తున్నారని సీసీజీ విమర్శించింది. సెక్షన్‌ 124ఏలో కన్నా ప్రమాదకరమైన సెక్షన్లు ఉపా చట్టంలో ఉన్నాయని తెలిపింది.