ప్రజాశక్తి - వినుకొండ (పల్నాడు జిల్లా):మద్యం, ఇతర దుర్వ్యసనాలు మానుకోవాలని మందలించిన తండ్రిని కుమారుడు రోకలిబండతో కొట్టి హత్య చేశాడో కొడుకు. ఈ సంఘటన పల్నాడు జిల్లా బల్లాపల్లి మండలంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతారామపురం గ్రామానికి చెందిన ఎం.హరిసింగ్ నాయక్ (60), హోనిబాయ్ దంపతులకు నలుగురు సంతానం. వారిలో రెండవ కుమారుడైన సత్తా నాయక్ కొంతకాలంగా వినుకొండ పట్టణంలో ఆటో నడుపుకుంటూ అక్కడే నివాసముంటున్నాడు. మద్యానికి బానిసవ్వడంతో తరచూ తల్లిదండ్రుల వద్దకొచ్చి గొడవపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి సీతారామపురానికి వెళ్లాడు. మద్యం తాగివచ్చిన కుమారుడిని తండ్రి వారించాడు. వ్యసనాలు మానుకోవాలని గట్టిగా చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తడంతో స్థానికులు సర్ధిచెప్పారు. బుధవారం ఉదయమూ ఇదే విషయమై హరిసింగ్ నాయక్ కుమారుడిని మందలిస్తుండగా విచక్షణ కోల్పోయాడు. ఇంట్లో ఉన్న రోకలిబండ తీసుకుని తండ్రి తలపై బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన హరిసింగ్ నాయక్ రక్తపు మడుగులో కుప్పకూలాడు. స్థానికులు 108 వాహనంలో వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.










