Jul 23,2023 07:44

ఢాకా (బంగ్లాదేశ్‌) : బంగ్లాదేశ్‌లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెరువులో బోల్తాపడటంతో 17మంది ప్రయాణీకులు మృతి చెందిన ఘటన ఝలకతి సదర్‌ ఉపజిల్లా పరిధిలోని ఛత్రకాండ ప్రాంతంలో జరిగింది.

భండారియా ఉపజిల్లా నుంచి ఫిరోజ్‌పూర్‌కు వెళుతున్న బస్సు స్థానిక యూనియన్‌ పరిషత్‌ కార్యాలయం సమీపంలో ఆటో రిక్షాకు సైడ్‌ ఇస్తుండగా, అదుపుతప్పి చెరువులో బోల్తాపడింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ గౌతమ్‌ కుమార్‌ ఘోష్‌ మాట్లాడుతూ ... ఈ ప్రమాదంలో 17మంది ప్రయాణీకులు మృతి చెందినట్లు తెలిపారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, 8 మంది మహిళలు ఉన్నట్లు చెప్పారు. బస్సులో 35 మందికిపైగా ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 65 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గాయపడినవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ప్రయాణీకుల్లో కొందరు మాట్లాడుతూ ... బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. పరిమితికి మించి ప్రయాణికులను బస్సులో ఎక్కించుకోవడం కూడా ప్రమాదానికి మరో కారణంగా చెప్పారు. చెరువులో నుంచి బస్సును బయటకు తీయడానికి పోలీసులు క్రేన్లను ఉపయోగిస్తున్నారు. క్షతగాత్రులు ఝలకతి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.