Oct 20,2022 21:20
  • సకాలంలో చెల్లింపులు జరగాలి
  • మహిళలకు అవకాశాలు పెంచాలి
  • డల్‌బర్గ్‌ అడ్వైజర్స్‌ అధ్యయనం వెల్లడి

ప్రజాశక్తి - బిజినెస్‌ బ్యూరో : గ్రామీణ కుటుంబాలకు ఆదాయాలు కల్పిస్తున్న మహాత్మగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌) మరింత విస్తృత పర్చాలని డల్‌బర్గ్‌ అడ్వైజర్స్‌ ఓ అధ్యయనంలో సూచించింది. సామాజిక, ఆర్థిక రక్షణ చర్యలను కోరుకునే కోట్లాది మంది అల్బాదాయ కుటుంబాలకు ఎలా తోడ్పాటును అందించాలనే అంశంపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి పలు సిఫార్సులు చేసింది. సామాజిక ప్రభావిత అడ్డయిజరీ గ్రూపు అయినా డల్‌బర్గ్‌ ''గ్రామీణ ఉపాధి పరిస్థితి : దేశంలోని ఐదు రాష్ట్రాల్లో తీరుపై ఓ పరిశీలన'' అనే అంశంపై అధ్యయనం చేసింది. ఈ సర్వేలో 4,600 మంది ప్రస్తుత, అర్హత కలిగిన లబ్ధిదారులను, గ్రామ పంచాయితీల నుంచి 1500 మంది స్థానిక అడ్మినిస్ట్రేటర్లను భాగస్వాములను చేసింది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, ఝార్కండ్‌, కర్నాటక, రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌ లాంటి ఐదు కీలక రాష్ట్రాల్లో అధ్యయనం చేసింది. ఈ పథకంలో లబ్ధిదారులకు ఉద్దేశించిన ప్రయోజనాలను వారికి అందించేలా. పలు అంతరాలను తొలగించే మార్గాలపై దృష్టి పెట్టినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఆ రిపోర్టు వివరాలు.. గ్రామీణ ప్రాంతాల్లోని 29 శాతం మంది యువత జాబ్‌ కార్డును పొందాలని అనుకుంటున్నారు. వీరిలో 72 శాతం ఎలాంటి జాబ్‌ కార్డు లేని కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. ఉపాధిలో పాల్గొన్న వారిలో కేవలం 37 శాతం మంది మాత్రమే సకాలంలో చెల్లింపులు పొందారు. మిగితా 63 శాతం మంది చెల్లింపుల్లో జాప్యం చోటు చేసుకుంటుంది. పని తనిఖీ, కొలతలకు సంబంధించిన సాంకేతిక సిబ్బంది కొరత వల్ల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుంది.
ఈ పథకం ప్రయోజనం, కవరేజీ ప్రభావాన్ని మరింత అధికం చేసేందుకు డల్‌బర్గ్‌ పలు సిఫార్సులు చేసింది. ''విస్తృతంగా అమల్లో ఉన్న ఈ పథకంలో మరెంతో మంది జాబ్‌ కార్డులను కోరుకుంటున్నారు. మరోవైపు చాలా మంది తాము కోరుకున్న దాని కంటే తక్కువ పనిని పొందుతున్నారు. ఈ పథకంలో పనులు పొందడంలో మహిళలు ఇతరుల కంటే మరిన్ని అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. పని చేసిన వారిలో దాదాపుగా వేతనాలు చెల్లించబడినప్పటికీ, ఇంకా చాలా మందికి చెల్లింపుల్లో జాప్యం నెలకొంటుంది. జాబ్‌ కార్డుదారుల్లో ఐదో వంతు మంది పనిలో ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కొన్నారు. దానికి పరిష్కారాన్ని కోరుకుంటున్నారు. ఎంజిఎన్‌ఆర్‌ఇఎస్‌ తిరుగులేని విధంగా అమలు చేయడంలో గ్రామపంచాయతీలకు తగినంత సిబ్బంది, నైపుణ్యాలు లేవు.'' అని ఈ సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలని ఆ సంస్థ సిఫార్సు చేసింది.
'' కరోనా సంక్షోభ కాలంలో ఉపాది హామీ పథకం కోట్లాది అల్పాదాయ కుటుంబాలకు జీనోపాధి భద్రతను కల్పించింది. మహిళలకు పని లభ్యతను మరింత పెంచాల్సిన అవశ్యకత ఉందని మా అధ్యయనంలో తేలింది. ఇప్పటికీ చాలా మంది మహిళలు పని పొందలేకపోతున్నారు. ఈ పథకం కింద పనులు పొందేందుకు ప్రయత్నించే సమయాల్లో తరుచూ వివక్షతకు గురైతున్నారు.'' అని డల్‌బర్గ్‌ అడ్వైజర్స్‌ పార్ట్‌నర్‌ శ్వేతా తోటపల్లి పేర్కొన్నారు.