- 1 నుంచి విద్యుత్తు టారిఫ్ బాదుడు
- వేల మంది కార్మికులు వీధిన పడాల్సిందేనా?
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : పరిశ్రమల ఏర్పాటు కోసం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పేరుతో భారీ అట్టహాసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం... విద్యుత్తు ఛార్జీల పెంపు ద్వారా ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమల ఉసురు తీయాలని చూస్తోంది. ప్రస్తుతం ఈ పరిశ్రమల నుంచి యూనిట్ ఒక్కంటికీ రూ.5.95 చొప్పున వసూలు చేస్తోంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఏకంగా రూ.1.91 పెంచి రూ.7.86 చొప్పున వసూలు చేయనుంది. ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమల్లో విద్యుత్తుతే కీలక పాత్ర. ఫెర్రో ఉత్పత్తికి విద్యుత్తు ఖర్చే 35 నుంచి 70 శాతం అవుతుంది. ఈ నేపథ్యంలో విద్యుత్తు ఛార్జీలు తగ్గించాలని, విద్యుత్తు రాయితీలు ఇవ్వాలని ఈ పరిశ్రమ వర్గాలు ఏళ్ల తరబడి డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం వీరు మొర వినకపోగా ఛార్జీలు భారం మోపేందుకు నిర్ణయం తీసుకుంది. విశాఖలో ఈ నెల 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జిఐఎస్) నిర్వహించి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఒయులను కుదుర్చుకున్నామని, దీనివల్ల వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి గొప్పగా ప్రకటించారు. అయితే, ఇందులో ఎన్ని పరిశ్రమలు కార్యరూపం దాలుస్తాయో? ఎన్ని ఉద్యోగాలు వస్తాయో? భవిష్యత్తులో తేలనుంది. ఫెర్రో పరిశ్రమను ఆదుకోకపోతే మాత్రం పరిశ్రమలు యాజమాన్యాలు, వాటిపై ఆధారపడిన 30 వేల కార్మిక కుటుంబాలు వీధిన పడనున్నాయి. ఇందులో వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలు చెందిన వారే 90 శాతంపైగా ఉంటారు. ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమ వల్ల అధికంగా విదేశీ మారక ద్రవ్యం కూడా ప్రస్తుతం సమకూరుతోంది. దీనికి కూడా గండి పడనుంది. దేశంలో ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమలు ఉన్న ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2002 నుంచి మంచి స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ పరిశ్రమను పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. విద్యుత్తు టారీఫ్‌ల విషయంలో మిగతా పరిశ్రమలకు ఒక లెక్క, ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమకు ఒక లెక్కగా రాష్ట్ర ప్రభుత్వం ధరలు నిర్ణయించింది. దీంతో, వచ్చే ఏప్రిల్ తర్వాత ఈ పరిశ్రమలను నడపగలమో? లేదో? అని వాటి యాజమాన్యాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి.
- ఇప్పటికే అధికం... మరింత భారం
రాష్ట్రంలోని విజయనగరం జిల్లా గరివిడి, గర్భాం, విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఆంజనేయ, అభిజిత్, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లా కాళహస్తి తదితర వెనుకబడిన ప్రాంతాల్లో 30 వరకూ ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమలు ఉన్నాయి. కుటీర పరిశ్రమగా ఇది అభివృద్ధి చెందింది. గరివిడి మేజర్ ఇండిస్టీగా ఉండేది. ప్రభుత్వాల విధానాల ఫలితంగా ఇది కూడా బలహీన పడింది. ఒక మిలియన్ టన్ను ఉత్పత్తికి రూ.5 వేల కోట్లు లభిస్తుంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో ఫెర్రో క్రోమ్‌కు అధిక డిమాండ్ ఉండడంతో మిగతా పరిశ్రమలతో పోల్చితే విదేశీ మారకద్రవ్యం అధికంగా సమకూరుతోంది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రస్తుతం మన రాష్ట్రంలోనే ఫెర్రో పరిశ్రమలకు విద్యుత్ టారిఫ్ ధర అధికంగా ఉంది. పైగా, వచ్చే నెల నుంచి మరింత పెరిగి రూ.7.86కు చేరుకోనుంది. ఇతర రాష్ట్రాలు విద్యుత్తు ఛార్జీలు పెంచడం లేదు. ఛత్తీస్‌గఢ్‌లో రూ.4.89, పశ్చిమబెంగాల్‌లో రూ.4.75, జార్ఖండ్‌లో రూ.4.25 విద్యుత్తు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఖతర్, ఒమన్, మలేషియాల్లో యూనిట్ ధర రూ.3.00 మాత్రమే ఉంది. పెంచిన విద్యుత్తు భారంపై తమ అభ్యర్థనలు తెలిపేందుకు రాష్ట్రంలోని గరివిడి ఫేకర్ యజమాని షరాఫ్ సహా పలు యాజమాన్యాలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలవాలని ఇటీవల ప్రయత్నించినా ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదని సమాచారం.










