Aug 16,2022 15:32

చందర్లపాడు: మూడేళ్లలో ప్రజలకు అందించిన అభివృద్ధి -సంక్షేమ పాలనతో సగర్వంగా ప్రజల ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్‌ మోహనరావు అన్నారు.చందర్లపాడు గ్రామంలో గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇంటి స్థలం మంజూరు చేసి ఇల్లు కట్టుకునే విధంగా ఆర్థిక చేయూత అందజేస్తున్నామన్నారు. నాడు- నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు -ప్రభుత్వ ఆసుపత్రుల రూపు రేఖలు మార్చామని వివరించారు. ప్రధానంగా డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ప్రజలు ఎమ్మెల్యే ఎదుట ఏకరువు పెట్టారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచి కస్తాలపున్నమ్మ, ఎంపీపీ వేల్పుల జయమ్మ, జడ్పిటిసి ముక్కపాటి నరసింహారావు, మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ వెలగపూడి వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి సాయిరాం, వార్డు సభ్యులు ,ఎంపీటీసీలు , వాలంటీర్లు -సచివాలయ సిబ్బంది ,వైసిపి నాయకులు పాల్గొన్నారు.