Sep 13,2023 21:38
  • వెనుకబడిన జిల్లాగా ప్రకాశాన్ని గుర్తించాలి
  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె ప్రభాకరరెడ్డి

ప్రజాశక్తి- మార్కాపురం, పెద్దారవీడు (ప్రకాశం జిల్లా) : వెనుకబడిన మూడు ప్రాంతాలనూ కలిపి ప్రకాశం జిల్లాగా 1972లో ఏర్పాటు చేశారేగానీ, దాని అభివృద్ధి గురించి పాలకులు పట్టించుకోలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధి కోసం ఐక్య పోరాటాలు అవసరమన్నారు. ప్రకాశం జిల్లా సమాగ్రాభివృద్ధి కోసం సిపిఎం పోరుబాట-పాదయాత్రలో భాగంగా మార్కాపురంలోని అమ్మవారిశాల బజారులో బుధవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర బడ్జెట్‌ రూ.2.79 లక్షల కోట్లని, అందులో రూ.10 వేల కోట్లు వెనుకబడిన ప్రకాశం జిల్లాకు ప్రభుత్వం ఎందుకు కేటాయించలేకపోతోందని ప్రశ్నించారు. ఓట్లు, సీట్లు కోసం పాలకులు పనిచేస్తున్నారే తప్ప, ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం చేస్తూ ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి నిర్వాసితులను ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. సభకు సిపిఎం పట్టణ కార్యదర్శి డి.సోమయ్య అధ్యక్షత వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్‌ హనీఫ్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జివి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పాదయాత్ర బృందానికి సమస్యలు విన్నవించిన వెలిగొండ నిర్వాసితులు

సిపిఎం పోరుబాట-పాదయాత్ర పెద్దారవీడు మండలంలోని వెలిగొండ ముంపు గ్రామమైన సుంకేసులకు మంగళవారం రాత్రి చేరుకుంది. ఆ గ్రామంలోని పరిస్థితులను, అక్కడి నిర్వాసితుల ఆర్థిక ఇబ్బందులను సిపిఎం నాయకులు అడిగి తెలుసుకున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు ప్రారంభమై రెండున్నర దశాబ్దాలు గడిచినా నేటికీ తమకు అందించాల్సిన ప్యాకేజీ ఇవ్వలేదని, ప్యాకేజీ వస్తుందన్న నమ్మకం కూడా కలగడం లేదని పాదయాత్ర బృందం ఎదుట పలువురు నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జివి.కొండారెడ్డి మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లోని నిర్వాసితులంతా కన్నతల్లి లాంటి ఉన్న ఊరిని వదిలి పెద్ద త్యాగమే చేశారన్నారు. వారిని పెద్ద మనసుతో ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.