ఇంటర్నెట్ డెస్క్ : బీహార్ బాగల్‌పూర్ జిల్లాలో నాలుగులైన్ల అగువానీ - సుల్తాన్‌గంజ్ బ్రిడ్జిని నిర్మాణ లోపాల కారణంగా అధికారులు కూల్చివేశారు. ఇంకో విశేషమేమిటంటే 2014లో ఇప్పటి ముఖ్యమంత్రి ఉన్న నితీష్‌కుమార్‌నే శంకుస్థాపన చేశారు. అప్పుడు బిజెపితో పొత్తు పెట్టుకున్న జెడియు అధినేత.. ఇప్పుడు అదే బిజెపితో తెగదెంపులు చేసుకుని ఆ రాష్ట్రంలోనే మరో పార్టీ జెడిఎస్‌తో పొత్తుపెట్టుకుని ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. నితీష్‌కుమార్ ఈ బ్రిడ్జి శంకుస్థాపన చేసిన దగ్గర నుంచే అంటే 2014 నుంచే ఈ బ్రిడ్జి పనులు సాగదీతగా సాగుతున్నాయి. అయితే గత ఆదివారం (జూన్ 4వ తేదీ) రోజున అధికారులు ఈ బ్రిడ్జిలోని కొంతభాగాన్ని కూల్చివేశారు. నిర్మాణ లోపాల కారణంగా దీన్ని కూల్చివేసినప్పటికీ దీనిపై బిజెపి నేతలు నితీష్‌కుమార్ ప్రభుత్వంపై మండిపడతున్నారు. ఈ బ్రిడ్జి కూల్చివేత వల్ల ఆర్థికంగా ఆ రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందని మండిపడుతున్నారు. అయితే ఈ బ్రిడ్జి కూల్చివేత వల్ల ఆర్థిక నష్టమే కానీ.. ప్రాణ నష్టం జరగలేదు. గతేడాది అక్టోబర్‌లో గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలిపోయి వందలాది మంది మృతి చెందారు. బిజెపి అధికారంలో ఉన్న గుజరాత్‌లో కూలిపోయిన వంతెన ఘటనలో ప్రాణ నష్టం జరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం, బిజెపి నేతలు నోరు మెదపకపోవడం గమనార్హం.
బీహార్‌లో ఎన్ని బ్రిడ్జిలు కూలిపోయాయంటే..
గతేడాది డిసెంబర్ 2022లో బెగుసరారులోని బుర్హి గండక్ నదిపై ఉన్న వంతెన పగుళ్లు ఏర్పడి, స్తంభాలు కూలిపోవడం వల్ల వంతెన కూలిపోయింది. ఇక గతేడాది నవంబర్‌లో నలంద జిల్లాలో మరో వంతెన కూలిపోవడంతో ఒక కార్మికుడు మృతి చెందాడు. మరొకరికి గాయాలయ్యాయి. కిషన్‌గంజ్, సహర్సా జిల్లాల్లో కూడా నిర్మాణంలో ఉన్న వంతెనలు ప్రారంభోత్సవానికి ముందే కూలిపోయాయి. తాజాగా బాగల్‌పూర్ బ్రిడ్జి కూడా కూలిపోవడంతో నితీష్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర బిజెపి నేత విజరుకుమర్ సిన్హా నితీష్‌కుమార్ ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణ పనుల్లో అవినీతికి పాల్పడుతుందని విమర్శించారు. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణ బాధ్యతల్ని స్వీకరించిన ఎస్‌పి సింగ్లా కంపెనీ గతంలో కూడా వివాదాల్లో చిక్కుకున్నట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ కంపెనీ పాట్నాలో లోహియా చక్ర పాత్ చేపట్టిన ప్రాజెక్టులో స్లాబ్ ఊడిపడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన మే 2020లో జరిగింది. తాజాగా బాగల్‌పూర్‌లో అగువానీ - సుల్తాన్‌గంజ్ బ్రిడ్జి కూలిపోవడంతో ఈ కంపెనీపై నితీష్‌కుమార్ ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధపడింది. తాజాగా ఘటనపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

నాణ్యతా లోపం
బాగల్‌పూర్ వంతెన కూలిపోవడానికి కారణం నిర్మాణ లోపమేనని నిపుణులు వెల్లడించారు. ముఖ్యంగా ఈ వంతెన గతేడాది ఏప్రిల్‌లో కూలిపోయినప్పుడు.. నాణ్యత లేని మెటీరియల్‌ను ఉపయోగించారని.. అందుకే వంతెన కూలిపోయిందని కేంద్ర మంత్రి నితీన్ గడ్కారీ విమర్శించారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 1700 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టింది. ప్రజాధనమంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారింది.
ఇక గుజారత్‌లో మోర్బీ వంతెన గతేడాది అక్టోబర్ 30న కూలిపోయింది. ఈ విషాద ఘటనలో 140 మంది మృతి చెందారు. ఈ ఘటన విచారణలో మోర్బీ వంతెన పునరుద్ధరణ పనులు కూడా నాసిరకంగా సాగాయి. వైర్లు తెగిపోయిన చోట వెల్డింగ్ పెట్టారని, చెక్క పలకలకు బదులు, అల్యూమినియం పలకలు వాడారని.. వంతెన సామర్థ్యంకి మించి జనాభా ఎక్కడంతో ఒక్కసారిగా కూలిపోయిందని తేలింది. దీనిపై గుజరాత్ హైకోర్టు ప్రమాద బాధితులకు 14.6 కోట్ల నష్ట పరిహారాన్ని ఇవ్వాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏదిఏమైనా బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వంతెన నిర్మాణ పనుల్లో ప్రభుత్వం, నిపుణుల పర్యవేక్షణ తప్పనిసరి. ముఖ్యంగా ప్రాణాలకు ముప్పు కలిగించే నిర్మాణ ప్రాజెక్టుల కాంట్రాక్టులను అసమర్థ అధికారులకు ఇవ్వకూడదు. అలా ఇవ్వడం వల్ల మరింత ప్రాణ నష్టం జరుగుతుంది. అలాగే నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు నిపుణులు పర్యవేక్షణలో సాగితే.. ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.










