Jun 02,2022 07:04

* 2013లో మొత్తం నియామకాలు 1128
* 2021లో 749మంది ఎంపిక
* నియామకాలు పెంచాలని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సూచన
న్యూఢిల్లీ :
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌...నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌కు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. సమర్థవంతమైన వ్యక్తుల్ని ప్రభుత్వ పాలనలోకి తీసుకురావటంలో యుపిఎస్‌సి కీలక పాత్ర పోషిస్తోంది. మోడీ సర్కార్‌ అధికారం చేపట్టింది మొదలు..సివిల్స్‌ నియామకాలకు ప్రాధాన్యత తగ్గిస్తోంది. తాజాగా విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లోనూ నియామకాల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2013లో యుపిఎస్‌సి ద్వారా 1228మందిని సివిల్స్‌కు ఎంపిక చేయగా, 2021లో ఆ సంఖ్య కేవలం 749కి పరిమితమైంది. 2013లో ఐఎఎస్‌ కేడర్‌కు 180మందిని ఎంపికచేయగా, ఇప్పుడూ అదే సంఖ్యలో నియామకాలు జరిగాయి. మోడీ సర్కార్‌ సివిల్స్‌ నియామకాలను కావాలనే కుదిస్తోందన్న విమర్శ ఉంది. ఏడాది క్రితం ఐఎఎస్‌ కేడర్‌ రూల్స్‌కు కేంద్రం అనేక మార్పులు చేసింది. ఇది కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వివిధ రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టాయి.
ఈ ఏడాది మార్చిలో సివిల్స్‌ నియామకాలపై పార్లమెంటరీ కమిటీ సమీక్ష జరిపింది. నియామకాల సంఖ్య పెంచాలని కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. ముఖ్యంగా ఐఏఎస్‌ల కొరత తీవ్రస్థాయిలో ఉందని, అటు రాష్ట్రాలు సైతం ఇబ్బంది పడుతున్నాయని తెలిపింది. అయితే ఈ అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ అవసరాలు, మంత్రిత్వ శాఖల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఐఎఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ల నియామకం పెంచాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖలో పనిచేసి రిటైర్‌ అయిన మాజీ ఐఎఎస్‌ వి.రామన్‌ అన్నారు.
సమూలంగా మార్చాలనుకుంటోంది..
సివిల్స్‌-2013లో మొత్తం 1228మంది ఎంపికకాగా, అందులో ఐఎఎస్‌లు-180, ఐఎఫ్‌ఎస్‌లు-32, ఐపిఎస్‌లు-150, కేంద్ర సర్వీసుల కింద గ్రూప్‌-1 ఆఫీసర్‌గా 710మందిని తీసుకున్నారు. తాజాగా విడుదలైన 2021 సివిల్‌ ఫలితాలు పరిశీలిస్తే, ఐఎఎస్‌కు-180, ఐఎఫ్‌ఎస్‌-32, ఐపీఎస్‌-150, గ్రూప్‌-ఏ ఆఫీసర్లు 710మందిని ఎంపికచేశారు.
''బహుశా ఈ వ్యవస్థ(సివిల్స్‌, ఐఏఎస్‌, ఐపీఎస్‌)ను సమూలంగా మార్చాలని మోడీ సర్కార్‌ భావిస్తోంది. పోస్టింగ్‌లు జారీచేయటంలోనూ కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని కేంద్రం భావిస్తోంది'' అని మరో మాజీ ఐఎఎస్‌ ప్రముఖుడు వెల్లడించారు.