Jun 13,2023 09:21
  • కేంద్రానికి మాత్రం నిబంధనలు వర్తించవట
  • ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న సర్కార్‌

తిరువనంతపురం : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కేరళ రుణ పరిమితిపై కోత విధించింది. చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో (జీఎస్‌డీపీ)లో మూడు శాతం వరకూ మార్కెట్‌ నుండి రుణం పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు అదనంగా మరో 0.5% రుణం పొందే అవకాశం ఉంది. అయితే కేంద్రం ఇటీవల రాష్ట్రాల రుణ పరిమితిని రెండు శాతానికి కుదించింది. తద్వారా రాష్ట్రాలను ఆర్థిక ఇబ్బందులలోకి నెట్టింది. కేరళ జీఎస్‌డీపీ రూ.11 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. మూడున్నర శాతం రుణ పరిమితికి అవకాశం ఇస్తే రాష్ట్రం రూ.38 వేల కోట్లు రుణం పొందవచ్చు. అయితే ఆర్థిక సంవత్సరంలోని మొదటి తొమ్మిది నెలల్లో కేవలం రూ.15,390 కోట్లు మాత్రమే రుణం పొందవచ్చునని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మిగిలిన మూడు నెలలలో రూ.5,131 కోట్ల రుణం తీసుకోవచ్చు. మొత్తంగా చూస్తే 2023-24లో కేరళ రూ.20,690 కోట్ల రుణం పొందే అవకాశం మాత్రమే ఉంది. దీంతో అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్‌లో పెద్ద ఎత్తున లోటు కన్పిస్తోంది.
 

                                                                  రుణాలు ఎలా పొందుతారు ?

రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ మార్గాలలో రుణాలు పొందుతాయి. మార్కెట్‌లో బాండ్లు విడుదల చేసి రుణం పొందవచ్చు. సెక్యూరిటీ డిపాజిట్లు, ప్రావిడెంట్‌ ఫండ్‌, ఇతర ట్రెజరీ డిపాజిట్లను రుణం రూపంలో వాడుకోవచ్చు. ఏదైనా పథకాన్ని అమలు చేసే ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రుణం పొందవచ్చు. ఉదాహరణకు కేరళ ప్రభుత్వం పెన్షన్‌ చెల్లింపుల కంపెనీ ద్వారా రుణం తీసుకుంటోంది. ఈ రుణం నుండి వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పెన్షన్లు అందిస్తోంది. ఈ రుణాలనే బడ్జెటేతర రుణాలు అంటారు. ఏదైనా పథకానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోతే ఈ తరహా రుణాలు తీసుకొని, ఆ పథకాలు అమలు చేస్తారు. లేదా ట్రెజరీలో నిధులు లేకపోతే అప్పుడు కూడా ఈ తరహా రుణాలు తీసుకుంటారు. ఇక ప్రభుత్వ రంగ సంస్థలు, ఏజెన్సీలు తమ సొంత పథకాల కోసం రుణం తీసుకోవచ్చు. దీనికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. కేరళలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలు కోసం ఒక బోర్డును ఏర్పాటు చేశారు. ఈ బోర్డు ఆయా ప్రాజెక్టులకు అవసరమైన నిధుల కోసం రుణాలు సేకరిస్తుంది. ఇక ప్రభుత్వ గ్యారంటీ కానీ, ఆర్థిక సాయం కానీ లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలు, ఏజెన్సీలు తమ ప్రాజెక్టుల కోసం రుణాలు తీసుకోవచ్చు. అయితే ఈ తరహా రుణాలన్నింటికీ పరిమితులు ఉంటాయి.
 

                                                                    కేంద్ర రుణాలపై కాగ్‌ మౌనం

కేంద్ర ప్రభుత్వం విషయానికి వస్తే ప్రభుత్వ ద్రవ్యలోటు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని దాటిపోయింది. అది బడ్జెటేతర రుణాలు సైతం తీసుకుంటోంది. 2019-20లో తీసుకున్న ఈ రుణం రూ.3.27 లక్షల కోట్లు. బడ్జెటేతర రుణాల విషయంలో కేరళ ప్రభుత్వాన్ని తప్పుపట్టిన కాగ్‌, కేంద్రం విషయంలో మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పైగా ద్రవ్యలోటులో ఈ రుణాలను చేర్చలేదు. ఇది ద్వంద్వ ప్రమాణాలు పాటించడమే అవుతుంది. కేరళ పెన్షన్‌ కంపెనీ తీసుకున్న బడ్జెటేతర రుణాల విషయంలో నికర రుణాలను కాకుండా స్థూల రుణాలను పరిగణనలోకి తీసుకున్నారు. కేరళ మౌలిక సదుపాయాల అభివృద్ధి బోర్డు చేపట్టిన ప్రాజెక్టులు బడ్జెట్‌లో లేవు.
         ఈ బోర్డు తీసుకున్న రుణంలో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ట్రెజరీలో చేరలేదు. అయినప్పటికీ కేంద్రం ఈ రుణాలను బడ్జెటేతర రుణాలుగా పరిగణించలేదు. ప్రభుత్వ గ్రాంట్ల నుండే బోర్డు రుణాలను చెల్లిస్తోందంటూ వితండవాదం చేస్తోంది. అయితే ఈ వాదనలో ఏ మాత్రం వాస్తవం లేదు. అదే సమయంలో కేంద్రం లక్ష కోట్ల రూపాయలకు పైగా కేటాయింపుతో 93 ప్రాజెక్టులు చేపట్టింది. కాగ్‌ ఆడిట్‌ నివేదిక మాత్రం దీనిని తప్పుపట్టలేదు.
         కేంద్ర ప్రభుత్వ రుణాలు, ద్రవ్యలోటును లెక్కించేట ప్పుడు బడ్జెట్‌, బడ్జెటేతర రుణాలను మినహాయిస్తూనే ఉన్నారు. రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి వివక్ష ప్రదర్శిస్తు న్నారు. చట్ట ప్రకారం కేంద్రమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా జీడీపీలో పరిమితికి మించి రుణాలు తీసుకోకూడదు. తీసుకున్న రుణాన్ని రెవెన్యూ ఖర్చు కోసం వినియోగించ కూడదు. రెవెన్యూ లోటును '0'గా చూపాలి. అయితే ఇప్పటివరకూ కేంద్రం ఈ నిబంధనలు పట్టించుకున్న దాఖలాలు లేవు. ద్రవ్యలోటు 4-6% మధ్య కొనసాగు తోంది. ఈ విధంగా కేంద్రం తరచూ నిబంధనలు మారు స్తూ రాష్ట్రాలను ఇబ్బందుల పాలు చేస్తూనే ఉంది.