Jul 06,2022 08:03
  • వ్యవసాయశాఖలో వందలాదిగా ట్రాన్స్‌ఫర్స్‌
  • క్షేత్ర స్థాయి సేవలు అస్తవ్యస్థం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : వ్యవసాయశాఖలో భారీ స్థాయిలో జరిగిన ఉద్యోగుల బదిలీలు ఖరీఫ్‌ రైతుకు కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. అదనపు డైరెక్టర్‌ మొదలుకొని అటెండర్‌ వరకు ఒక్క ఉదుటున బదిలీలు కావడంతో శాఖ పరిపాలన అస్తవ్యస్థమైంది. సరిగ్గా ఖరీఫ్‌ సీజన్‌ మొదలవుతుందనగా, తొలకరి వానలు కురుస్తున్న సమయాన బదిలీల ప్రహసనం ముందుకు రావడంతో రైతులను పట్టించుకునే నాథుడే లేడు. పంటల బీమాలో అవకతవకలు, ఇ-క్రాప్‌లో తప్పులు-అక్రమాలు, సబ్సిడీ విత్తనాల పంపిణీ, కల్తీ, నకిలీ విత్తనాలపై నియంత్రణ, ఎరువుల లభ్యత, కౌలు రైతులకు గుర్తింపు కార్డుల పంపిణీ, సున్నావడ్డీ క్లెయిములు, వ్యవసాయ రుణాలు, పంటల సాగులో రైతన్నలకు సలహాలు... ఇటువంటి కీలక సమయంలో వ్యవసాయశాఖ సిబ్బంది, అధికారులు అందుబాటులో లేరు.
 

                                                                  ఎప్పుడూ లేదు !

జూన్‌ 8 నుండి అదే నెల 30 వరకు సిబ్బంది బదిలీలపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తేయడంతో ఈ మారు ఏ శాఖలో లేని విధంగా వ్యవసాయశాఖలో సామూహిక బదిలీలు నిర్వహించారు. ఇటీవలి కొన్నేళ్లల్లో వ్యవసాయశాఖలో ఇప్పుడే పెద్ద సంఖ్యలో మూకుమ్మడి ట్రాన్స్‌ఫర్స్‌ చేశారని చెబుతున్నారు. వైసిపి సర్కారు వచ్చిన తొలేడాది బదిలీలు బానే జరిగాయి. ఆ తర్వాత కొన్ని ముఖ్యమైన బదిలీలకే ప్రాధాన్యమిచ్చారు. ఈ తడవ ఐచ్ఛికాలు, అభ్యర్ధనలు, హెల్త్‌గ్రౌండ్స్‌, పరస్పరాలు, ఒకే స్థలంలో ఐదేళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకున్నవారు.. ఇలా నిబంధనల్లో పలు సడలింపులు ఇవ్వడంతో సిబ్బంది తమకు నచ్చిన, తమను మెచ్చిన, లాభదాయకమైన ప్లేస్‌లు, పోస్టింగ్‌ల కోసం అందివచ్చిన అన్ని అవకాశాలనూ, ఆయుధాలనూ ఉపయోగపెట్టారు. పైరవీలు, లంచాలు, రాజకీయ సిఫారసులకు కొదవే లేదు. బదిలీల ప్రయాసతో జూన్‌ మొత్తం గడిచిపోయింది. ఇప్పుడు జులైలో.. బదిలీ అయిన ఉద్యోగులు, అధికారులు కొత్త ప్రదేశాల్లో చేరికలు, ప్లేస్‌ నచ్చనివారు సెలవులో వెళ్లడం, అసంతృప్తులు నడుస్తున్నాయి. బదిలీల గందరగోళం మామూలుగా లేదు. క్షేత్ర స్థాయిలో కీలకంగా పని చేసే ఎఇఒలు, మండల ఎఒలు, ఎడిలు, డిఎఒలు, డిడిలు వందల సంఖ్యలో ఒకేసారి ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. వ్యవసాయ కమిషనరేట్‌లో ముఖ్య పర్యవేక్షణాధికారులు కొందరు జిల్లాలకు బదిలీలపై వెళ్లారు. గ్రామాల్లో నెలకొల్పిన రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె)లో రిక్రూట్‌ అయిన వ్యవసాయ సహాయకులు ప్రొబేషన్‌ వ్యవహారం, ఇతర వ్యాపకాల్లో పడి రైతులకు చిక్కట్లేదు, దొరకట్లేదు. వీరి పనిని పర్యవేక్షించే ఎఒ, ఎడిలు బదిలీల తాపత్రయంలో ఉన్నారు.
                                   

                                                              పైనా అయోమయమే..

పైస్థాయిలోనూ అయోమయం నెలకొంది. రెండు మాసాల క్రితం ఐఎఎస్‌ల బదిలీల్లో భాగంగా వ్యవసాయ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్‌కు స్థాన చలనం కలిగింది. అక్కడికి సిహెచ్‌ హరికిరణ్‌ వచ్చారు. బదిలీల మూమెంట్‌లో ఆయన పక్షం రోజులు సెలవు పెట్టారు. ఎపి సీడ్స్‌ ఎం.డి. జి శేఖర్‌బాబుకు తాత్కాలికంగా కమిషనర్‌ బాధ్యతలు అప్పగించారు. సెలవులో వెళ్లిన హరికిరణ్‌ ఇక ఇక్కడికి తిరిగి రారని, వేరే చోటికి ప్రయత్నిస్తున్నారని ప్రచారం సాగుతోంది. శేఖర్‌బాబునే పూర్తి స్థాయి కమిషనర్‌గా నియమిస్తారన్న ఊహాగానాలూ ఉన్నాయి.