Nov 11,2023 21:36

- రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు వక్తల డిమాండ్‌
ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌:తిరుమలలో పనిచేసే కల్యాణకట్ట క్షురకులను టిటిడి యాజమాన్యం వేధింపులకు గురిచేయడం సరికాదని, కెఒడి (కెప్ట్‌ ఆన్‌ డ్యూటీ)ని రద్దు చేయాలని రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు వక్తలు డిమాండ్‌ చేసింది. తిరుపతిలోని యశోదానగర్‌ వేమన విజ్ఞాన కేంద్రంలో శ్రీవారి కల్యాణకట్ట నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శనివారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ.. కల్యాణకట్టలో 849 మంది క్షురకులు పని చేస్తున్నారని, కెఒడి పేరిట 49 మందికి డ్యూటీలు ఇవ్వకుండా తొలగించడం దారుణమన్నారు. వారిని తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. యాజమాన్యానికి అనుకూలంగా టిటిడి బోర్డు సభ్యులు యానాదయ్య, మరికొందరు మాట్లాడటం సరికాదన్నారు. క్షురకులకు న్యాయం చేయాలని, ఈ విషయంపై టిటిడి ఇఒ ధర్మారెడ్డి, ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి స్పందించాలని కోరారు. పది రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే తిరుపతిలోని టిటిడి ఎడి బిల్డింగ్‌ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి. నాగరాజు, శ్రీవారి కల్యాణకట్ట నాయీ బ్రాహ్మణ సంఘం కార్యదర్శి ప్రసాద్‌, రాష్ట్రపతి అవార్డు గ్రహీత రాధాదేవి, సంఘం జిల్లా అధ్యక్షులు గంగులప్ప, బిసి ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర నేత బుట్టా సుధాకర్‌ యాదవ్‌ పాల్గొన్నారు.