Oct 13,2023 08:17

ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి:తన నివాసాన్ని, క్యాంపు కార్యాలయాలను ముఖ్యమంత్రి విశాఖకు తరలిస్తామనడం కేవలం విశాఖలో ఉండే రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనాల కోసం తప్ప అందులో రాష్ట్ర ప్రయోజనాలు లేవని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. తరలింపు వల్ల రాష్ట్ర ప్రయోజనాలు ఏమి లేవన్నారు. వ్యవసాయరంగ పరిస్థితులు- ప్రత్యామ్నాయ విధానాలు అనే రాష్ట్రస్థాయి సదస్సుకు కర్నూలుకు విచ్చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సమీక్ష చేయడానికి ఈ హంగామా చేస్తున్నట్లుగా ప్రభుత్వం నమ్మబలుకుతోందన్నారు. ఇంత కన్నా పచ్చిదగా, మోసం లేదన్నారు. ఎందుకంటే సిఎం మూడు రాజధానుల గురించి మాట్లాడారని, అలాంటప్పుడు కర్నూలులో క్యాంపు కార్యాలయం పెట్టరా? కర్నూలుకు ప్రభుత్వ శాఖలు తరలించారా? అని ప్రశ్నించారు. ఒకవైపు అమరావతి రాజధానిని అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. అక్కడి రైతులను తుంగలో తొక్కి ఇప్పుడు ఎవరినో ఉద్ధరిస్తామని అంటున్నారని తెలిపారు. ఉత్తరాంధ్రను అభివృద్ది చేయకుండా ఈ నాలుగేళ్లు నిద్ర పోతున్నారా? రాయలసీమ అభివృద్ధికి క్యాంపు ఆఫీస్‌ అవసరం లేదా? అని ప్రశ్నించారు. ఈ రకమైన మోసపు మాటలను ప్రజలు విశ్వసించరన్నారు.