- ప్రారంభమైన సిపిఎం, సిపిఐ ప్రచారభేరి
- రాష్ట్ర వ్యాప్తంగా సభలు, ర్యాలీలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : హిందుత్వా కార్పొరేట్ కూటమిగా సాగుతున్న బిజెపి ప్రభుత్వాన్ని 2024 ఎన్నికల్లో సాగనంపాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, సిపిఐ జాతీయ కార్యదర్శి బినయ్ విశ్వం ప్రజలకు పిలుపునిచ్చారు.వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులు అందుకు నడుం బిగించాలని, ఆయా రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా ఎత్తుగడలు రూపొందించుకోవాలన్నారు. ప్రజా వ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద బిజెపిని మోదీని సాగనంపుదాం, దేశాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో సిపిఐాసిపిఎం చేపట్టిన ప్రచారభేరిని విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారంనాడు వారు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా సిపిఎంాసిపిఐ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ, అనేక మండల కేంద్రాల్లో ప్రచార భేరీ ప్రారంభ సభలు, ర్యాలీలు జరిగాయి.
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు వి శ్రీనివాసరావు, కె రామకృష్ణలతో కలిసి ప్రకాశ్ కరత్, బినరు విశ్వం నివాళలర్పించారు. అనంతరం బైక్‌ర్యాలీగా ఏలూరు రోడ్డు, మ్యూజియం రోడ్డు మీదగా ఎంబి విజ్ఞాన కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ జరిగిన సభలో ప్రకాశ్ కరత్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం హిందూత్వ కార్పొరేట్ కూటమి అని, ఒకవైపు దేశాన్ని హిందూ రాష్ట్రగా మార్చాలని ప్రయత్నిస్తూ మరోవైపు కార్పొరేట్లకు కొమ్ముకాస్తోందని అన్నారు. బిజెపి అధికారంలో ఉన్న గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో చట్టాలు సవరించి లవ్ జీహాద్, గో రక్షక చట్టాలు పేరుతో మైనార్టీలు, దళితులు, గిరిజనులపై దాడులు చేస్తున్నారని తెలిపారు. కార్పొరేట్లపై అదనపు పన్నులు వేయకుండా సామాన్య ప్రజలపై పన్నుల భారాలు మోపుతున్నారని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిందని, వ్యవసాయం సంక్షోభంలోకి కూరుకుపోయిందని, ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్నారని తెలిపారు. ప్రజల సమస్యలు లేవనెత్తుతున్న ప్రతిపక్షల గొంతును పార్లమెంటులో నొక్కుతుందని, ఈడి, సిబిఐ, ఐటీ వంటి సంస్థలతో దాడులు చేయిస్తోందని విమర్శించారు. భారతదేశం హిందూ రాష్ట్రగా మారడం అంటే దేశ వినాశనమే అని అంబేద్కర్ చెప్పారని గుర్తుచేశారు. అటువంటి అంబేద్కర్‌ను తమ సొంతం చేసుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహించారు. దేశంలో బిజెపికి వ్యతిరేకంగా ఉండే లౌకిక, ప్రజాతంత్ర శక్తులు ఐక్య ప్రజా ఉద్యమాలు సాగించాలన్నారు. కార్మికవర్గం, ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతుతో రెండేళ్లుగా సాగుతున్న పోరాట కారణంగానే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను కేంద్రంసాహసించలేకపోతున్నదని అన్నారు. కేంద్రం నిరంకుశ విధానాలు, రాష్ట్రాల హక్కులు హరించే విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు పోరాడుతున్నాయని తెలిపారు. కాని ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తూచ తప్పకుండా బిజెపి విధానాలను అమలు చేస్తూ కేంద్రాన్ని పల్లెత్తు మాట అనడం లేదని విమర్శించారు. బిజెపి ఆర్ధిక, హిందూత్వ, కార్పొరేటీకరణ విధానాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ విధానాలను కూడా ప్రజల్లో ఎండగట్టాలని కోరారు.
బినయ్ విశ్వం మాట్లాడుతూ దేశంలో మోడీ అనుసరిస్తున్న హిందుత్వ సిద్ధాంతానికి భిన్నమైన సిద్ధాంతం కమ్యూనిస్టుల దగ్గర ఉందన్నారు. మార్క్సిజం ఒక శాస్త్రమని, పెట్టుబడి అందర్నీ తన బానిసలుగా చేస్తుందని కారల్‌మార్క్స్ చెప్పారని, మోడీ ప్రభుత్వంలో అలాంటి విధానాలనే చూస్తున్నామన్నారు. అదానీ వంటి పెట్టుబడిదారులకు బానిసగా మోడీ మారిపోయారని విమర్శించారు. ఫాసిస్టు ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతంతో దేశాన్ని పరిపాలించేందుకు మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అవినీతి మచ్చలేని వారు కమ్యూనిస్టులు అని, వారికి ఈడీ, ఐటీ, సీబీఐ అంటే ఎలాంటి భయం ఉండబోదని స్పష్టం చేశారు. సిపిఐ, సిపిఎం ఎన్నికల కమిషన్ ఇచ్చే సర్టిఫికెట్లతో పనిచేయడం లేదని, ప్రజాపోరాటాలతో జనం మద్దతుతో ఈ పార్టీలు కొనసాగుతున్నాయని చెప్పారు. కమ్యూనిస్టుల ఐక్యత అత్యవసరమని, ప్రతి అంశంలోనూ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, ఉమ్మడి పోరాటాలు అత్యవసరమని పునరుద్ఘాటించారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ అంబేద్కర్‌కు భారీ ఎత్తున విగ్రహాలు కట్టి, పెద్దఎత్తున ప్రభుత్వాలు ఉత్సవాల్ని నిర్వహిస్తూ, మరోవైపు దళిత, ఆదివాసీ, బీసీలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులను విస్మరిస్తున్నాయని విమర్శించారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ మోడీ తొలగించారని, రిజర్వేషన్లు సరిగ్గా అమలు చేయడం లేదని, మనువాదం పేరుతో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ భూములను పెత్తందారులకు కట్టబెట్టేందుకు అటవీ సంరక్షణ చట్టాలను సవరణ తెస్తున్నారని విమర్శించారు. సిపిఐ రాష్ట్రకార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రానికి మోడీ తీవ్ర ద్రోహం చేశారని విమర్శించారు. దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనపై పెద్దఎత్తున పోరాటాలకు సిద్ధమవ్వాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి శంకర్ అధ్యక్షత వహించిన ఈ సభలో సిపిఎం సీనియర్ నాయకులు పి మధు, రాష్ట్ర కమిటీ సభ్యులు కె శ్రీదేవి, డివి కృష్ణ, దోనేపూడి కాశీనాధ్, కార్పొరేటర్ సత్తిబాబు, నాయకులు, ప్రవీణ్, కృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.దుర్గాభవాని, సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, నాయకులు లంకా దుర్గారావు, నక్కా వీరభద్రరరావు తదితరులు పాల్గన్నారు.










