Sep 29,2023 22:14
  • తోడు ఉన్నామన్న భరోసా పేదలకు ఇవ్వాలి
  • ప్రారంభోత్సవంలో సిఎం వైఎస్‌ జగన్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మొత్తం ఐదు దశల్లో జరుగుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మొదటి దశ సెప్టెంబరు 15 నుంచి జరుగుతోందని, శనివారం తొలి క్యాంపు నిర్వహిస్తామని వెల్లడించారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా జగన్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి పేదవాడికీ తోడుగా ఉన్నామన్న భరోసా ఇవ్వగలిగితే వారికి మంచి జరుగుతుందని సిఎం అన్నారు. తొలిదశలో ప్రతి ఇంటికీ గ్రామంలో ఉన్న వలంటీరు, ప్రజాప్రతినిధులు, గృహ సారథులు వెళ్లి అవగాహన కలిగించవచ్చుని తెలిపారు. ఇంటికి వచ్చి ఏడు రకాల పరీక్షలు అందుబాటులో ఉంచి మ్యాపింగ్‌ చేస్తారని చెప్పారు. రెండో దశలో గ్రామంలో విలేజ్‌ క్లినిక్‌ రెండు భాగాలుగా విడిపోతుందన్నారు. ఒక భాగానికి సిహెచ్‌ఒ, మరో భాగానికి ఎఎన్‌ఎం బాధ్యత తీసుకుంటారని తెలిపారు. ఆశావర్కర్లు, వలంటీర్లతో మమేకమై ప్రతి ఇంటికీ వెళ్లి జల్లెడ పడతారన్నారు. ప్రతి ఇంట్లోనూ ఏడు రకాల పరీక్షలు చేసే ఎక్విప్‌మెంట్‌ను కూడా తీసుకెళ్తారని వివరించారు. బిపి, షుగర్‌, హెమోగ్లోబిన్‌ తప్పనిసరిగా పరీక్షలు చేస్తారని పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి యూరిన్‌, మలేరియా, డెంగీ, కఫం పరీక్షలు చేస్తారని తెలిపారు. తర్వాత ఆరోగ్య శ్రీ యాప్‌ ద్వారా మ్యాపింగ్‌ చేసి, పరీక్షల ఫలితాలు ఆధారంగా ఆరోగ్య శిబిరాల్లో చికిత్సలు అందిస్తారని పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీని ఎలా ఉపయోగించుకోవాలో కూడా పూర్తిగా అవగాహన కల్పిస్తారని అన్నారు. ఫోన్లలో ఆరోగ్య శ్రీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయిస్తారని, వీటన్నిటిపై రెండో దశలో అవగాహన కల్పిస్తారని చెప్పారు. గ్రామాల్లోని గర్భిణులు, బాలింతలు, చిన్నారుల రక్తహీనతపై ప్రత్యేక ధ్యాస పెట్టాలని, మ్యాపింగ్‌ చేసి మందులతోపాటు ఫుడ్‌ సప్లిమెంటేషన్‌ కూడా జరుగుతుందన్నారు. మూడో దశలో హెల్త్‌ క్యాంపునకు మూడు రోజుల ముందు వలంటీర్లు, గృహ సారథులు, ప్రభుత్వంపై మమకారం ఉన్నవాళ్లంతా ఏకమై ప్రతి ఇంటికీ వెళ్లి అవగాహన కలిగిస్తారని తెలిపారు. గ్రామంలో హెల్త్‌ క్యాంపు ఎప్పుడు నిర్వహిస్తారో వివరాలు చెప్పి, అందరూ పాల్గొనేలా చెప్పాలన్నారు. నాలుగో దశలో హెల్త్‌ క్యాంపులో అవసరమైన పరీక్షలు చేయించడం, డాక్టర్లతో వారికి చికిత్స మందులు ఇప్పించాలని చెప్పారు. వృద్ధులకు కంటి పరీక్షలు చేసి కళ్లజోళ్లు ఇప్పించాలన్నారు. ఇదంతా పూర్తయిన తర్వాత ఆరోగ్య శ్రీ కింద గతంలో సేవలు పొందిన వారిని మ్యాపింగ్‌ చేస్తారని వివరించారు. ఆరోగ్య శ్రీ సేవలు పొందాల్సిన వారిని కూడా మ్యాపింగ్‌ చేస్తారని పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌లో ఉన్న డాక్టర్‌, విలేజ్‌ క్లినిక్‌ వీరిని మ్యాపింగ్‌ చేసి వలంటీర్ల సహాయంతో తగిన వైద్యం అందించే చర్యలు తీసుకుంటారని చెప్పారు. చికిత్స అనంతరం సేవలు సరిగ్గా అందుతున్నాయా? లేవా? ఆరోగ్య శ్రీ సేవలు అందాల్సిన వారికి ఎలా అందించాలి? వంటి అంశాలపై సురక్షలో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా హెల్త్‌ క్యాంపులోనే ఈ సేవలన్నీ అందుతాయని వెల్లడించారు. ఐదో దశలో సురక్ష క్యాంపుల్లో గుర్తించిన వారికి నయం అయ్యేంత వరకూ చేయూత ఇస్తారని చెప్పారు. సిబ్బంది ఓనర్‌షిప్‌ తీసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. చికిత్సలు అందడమే కాకుండా తర్వాత వారికి సేవలు అందేలా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఆరోగ్య శ్రీ, వైఎస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా కార్యక్రమాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎమ్‌టి కృష్ణబాబు, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి, ఆర్థికశాఖ కార్యదర్శి వివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.