Jun 16,2023 15:03

అమరావతి: రాష్ట్రం ఉష్ణగుండాన్ని తలపిస్తోంది..రెండు రోజుల క్రితంతో పోలిస్తే శుక్రవారం తీవ్రత మరింత పెరిగింది. ఈ వేసవిలో ఎన్నడూ లేనంతగా 210 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచాయి. అంటే రాష్ట్రంలోని 31శాతం మండలాలు నిప్పుల గుండాన్ని తలపించాయి. మరో 220 మండలాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంది. మొత్తంగా చూస్తే 64శాతం పైగా మండలాల్లోని ప్రజలు ఉష్ణతాపంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. నర్సాపురంలో సాధారణం కంటే అధికంగా 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. శుక్ర, శనివారాల్లో వడగాలుల తీవ్రత మరింత పెరగనుంది. 268 మండలాల్లో తీవ్రంగానూ, 235 మండలాల్లో ఒక స్థాయిలోనూ వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.రాష్ట్రంలో అత్యధికంగా ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.5, ప్రకాశం జిల్లా కురిచేడులో 44.2, తూర్పుగోదావరి జిల్లా చిట్యాల, ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో 44.1, తిరుపతి జిల్లా సత్యవేడులో 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.సాధారణం కంటే నర్సాపురంలో 7.9, విశాఖపట్నం, బాపట్లలో 7.1, మచిలీపట్నంలో 6.9, జంగమహేశ్వరపురంలో 6.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి.వాతావరణంలో తేమశాతం బాగా తగ్గింది. రాష్ట్రంలోనే అత్యల్పంగా బాపట్లలో 22శాతం, కర్నూలులో 27శాతం, అనంతపురం, నంద్యాలలో 28శాతం, నందిగామ, అమరావతి, గన్నవరంలో 29శాతం చొప్పున నమోదైంది.