Mar 14,2023 09:01
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలుచోట్ల యథేచ్ఛగా వైసిపి దొంగ ఓట్లు
  • ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో అధిక ఓటింగ్‌
  • రేపు తిరుపతి 229, 233 బూత్‌ల్లో రీపోలింగ్‌

ప్రజాశక్తి- యంత్రాంగం : చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రంలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో సోమవారం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉత్తరాంధ్ర (ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం) పట్టభద్రుల స్థానంలో 59.77 శాతం, పశ్చిమ రాయలసీమ (ఉమ్మడి కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు) పట్టభద్రుల నియోజకవర్గంలో 65.92 శాతం, ఉపాధ్యాయ నియోజక వర్గంలో 89.38 శాతం, తూర్పు రాయలసీమ (ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు) పట్టభద్రుల నియోజకవర్గంలో 65.28 శాతం, ఉపాధ్యాయ నియోజకవర్గంలో 84.92 శాతం ఓట్లు పోలయ్యాయి. అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో తిరుపతిలోని 229, 233 పోలింగ్‌ బూత్‌లలో ఈ నెల 15న రీపోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఆ జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి హరినారాయణ్‌ ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రభుత్వ పాఠశాలలోని 43, 43ఎలో సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేయడంలో ఆలస్యం కావడంతో ఎనిమిది గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్‌ అరగంట ఆలస్యంగా మొదలైంది. సాయంత్రం నాలుగు గంటలలోగా పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన వారందరినీ ఆ తర్వాత కూడా ఓటు వేయడానికి అధికారులు అనుమతించారు. నాలుగు గంటల తర్వాత వచ్చిన వారిని అనుమతించలేదు. పోలింగ్‌ మొదట మండకొడిగా ప్రారంభమైంది. చివరి రెండు గంటల్లో ఊపందుకుంది. పోలింగ్‌ సిబ్బందిగా ఉపాధ్యాయులు గతంలో ఉండేవారు. ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌ మేరకు ప్రభుత్వం ఉపాధ్యాయులను పోలింగ్‌ ప్రక్రియకు దూరంగా ఉంచింది. పోలింగ్‌ సిబ్బందిలో ఎక్కువమంది అనుభవం తక్కువగా ఉన్న వారే కావడంతో పోలింగ్‌ ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టింది. ఓటర్లు గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చోవాల్సి వచ్చింది. దీంతో, కొందరు ఇంటి ముఖం పట్టి ఆ తర్వాత మళ్లీ ఓటెయ్యడానికి వచ్చారు. పలుచోట్ల అధికార పార్టీ దౌర్యన్యానికి దిగింది. అధికార యంత్రాంగం అండదండలతో దొంగ ఓట్లు వేయించింది. దొంగ ఓట్లకు సహకరించని ఎన్నికల అధికారులపైనా దాడులకు పాల్పడింది. వీటిపై ప్రశ్నించిన ప్రతిపక్షాల వారిపై పోలీసులు దౌర్జన్యం చేశారు. పలువురిని అరెస్టు చేసి పోలింగ్‌ అనంతరం విడుదల చేశారు. దొంగ ఓటును అడ్డుకున్న తిరుపతిలోని 229 పోలింగ్‌ కేందం అధికారిపై వైసిపి శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. 50 బ్యాలెట్‌ పేపర్లను చించేసి బ్యాలట్‌ బాక్సులో వేశాయి. 233 పోలింగ్‌ కేంద్రాల్లోనూ వైసిపి వారు దొంగ ఓట్లు వేయించినట్లు ప్రత్యర్థులు ఫిర్యాదు చేశారు. దీంతో, భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ రెండు పోలింగ్‌ బూత్‌లతో ఈ నెల 15న రీపోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఆ జిల్లా కలెక్టర్‌ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో పలుచోట్ల కూడా వైసిపి శ్రేణులు జులుం ప్రదర్శించాయి. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. దొంగ ఓట్లపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పైగా, టిడిపి, పిడిఎఫ్‌, వామపక్ష శ్రేణులను అడ్డుకోవడం, అరెస్టు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు.
 

                                                   ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుటుంబ సభ్యుల ఓట్లు గల్లంతు

అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతోపాటు ఆయన కుటుంబసభ్యుల ఓట్లు గల్లంతయ్యాయి. విజయనగరంలోని కస్పా హైస్కూలు పోలింగ్‌ కేంద్రంలో 33 మందికి ఓటు హక్కు ఉన్నప్పటికీ వారి ఓట్లను అధికారులు రద్దు చేశారు. ఇందులో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు జె.రమేష్‌చంద్ర పట్నాయక్‌ ఓటు కూడా ఉంది. దీంతో, పోలింగ్‌ కేంద్రం వద్ద ఆయన నిరసన తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాలో పలువురు పట్టభద్రులు, ఉపాధ్యాయుల పేర్లు ఓటరు జాబితాలో లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. మరోపక్క డిగ్రీ చదవని వారు కూడా ఓటర్ల నమోదై దర్జాగా ఓటు వేశారు. పలు బూత్‌ల వద్ద ఇటువంటి వారిని పిడిఎఫ్‌, టిడిపి శ్రేణులు అడ్డుకున్నాయి. తిరుపతిలో దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన మహిళలు మీడియాకు చిక్కారు. దీంతో, వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఉత్తరాంధ్రలో 37 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో బ్యాలెట్‌ పేపర్‌ పెద్దగా ఉంది. విశాఖ జిల్లా పెందుర్తి శాంతినగర్‌ పాఠశాల వద్ద ఓ మహిళా ఓటరు ఎండకు తాళలేక సొమ్మసిల్లిపడిపోయారు. అల్లూరి జిల్లా హుకుంపేటలో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న విఆర్‌ఒ అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ని పాడేరు జిల్లా కేంద్రం ఆసుపత్రికి తరలించారు.