- దళిత నేత మాంజీకి ఎర !
- కేబినెట్ నుంచి వైదొలిగిన సంతోష్ సుమన్
పాట్నా : బీహార్‌లో ఈ నెల 23న జాతీయ స్థాయి ప్రతిపక్షాలు సమావేశం కానున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని జెడిఎస్ నేతృత్వ మహాఘట్బంధన్ కూటమి ప్రభుత్వాన్ని అస్థిర పర్చేందుకు బిజెపి ఎత్తులు వేస్తోందా? అనంటే తాజా పరిణామాలు అవుననే సంకేతాలిస్తున్నాయి. రాజకీయ పరిశీలకుల విశ్లేషణలు కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దళిత నేత, హిందూస్థానీ ఆవామ్ మోర్చా (సెక్యులర్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంజీని బిజెపి ప్రలోభాలకు గురిచేస్తోందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంత్రివర్గంలో మంగళవారం నాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. జితన్ రామ్ మాంజీ కుమారుడు, రాష్ట్ర షెడ్యూల్డ్ తరగతులు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) శాఖ మంత్రి సంతోష్ సుమన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 23న జాతీయ స్థాయి ప్రతిపక్ష పార్టీల సమావేశం పాట్నాలో నిర్వహించనున్న నేపథ్యంలో జరిగిన ఈ పరిణామం నితీష్ కుమార్ గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. జెడియు సీనియర్ నేత, రాష్ట్ర ఆర్థిక మంత్రి విజరు కుమార్‌తో సమావేశం అనంతరం సుమన్ తన రాజీనామా విషయాన్ని ప్రకటించారు. హెచ్‌ఎఎం(ఎస్) పార్టీని జెడిఎస్‌లో విలీనం చేయాలంటూ ఒత్తిడి పెరుగుతున్నందునే తాను మంత్రి పదవికి రాజీనామా చేశానని తెలిపారు. అయితే మహాకూటమిలో తమ పార్టీ భాగస్వామిగానే ఉంటుందని, ప్రభుత్వం నుంచి విడిపోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో తమకు 5 లోక్‌సభ స్థానాలు కేటాయించాలని హెచ్‌ఎంఎం(ఎస్) అధినేత జితన్ రామ్ మాంజీ ఇదివరకే డిమాండ్ చేసివున్నారు. పాట్నాలో జరగనున్న ప్రతిపక్షాల సమావేశానికి ఆహ్వానించకపోవడం పట్ల కూడా జితన్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. బీహార్ శాసనసభలో హెచ్‌ఎఎంఎస్‌కు నలుగురు సభ్యులున్నారు. గతేడాది బిజెపి కూటమి నుంచి నితీష్ బయటకు రావడంతో మాంజీ భేషరతుగా మద్దతు ప్రకటించారు. అయితే బిజెపి నుంచి పెద్ద ఆఫర్ ఏదో వచ్చినందునే కేబినెట్ నుంచి నిష్క్రమణ నిర్ణయానికి దారితీసివుండవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఏప్రిల్‌లో మాంజీ, ఆయన కుమార్ సంతోష్ సుమన్ కేంద్ర హోంమంత్రి, బిజెపి అగ్రనేత అమిత్ షాతో ఢిల్లీలో భేటీ అయ్యారు. దీనిపై నితీష్ సహచర మంత్రి లెసీ సింగ్ స్పందిస్తూ సంతోష్ వైదొలగడం వల్ల ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావమూ ఉండబోదని తెలిపారు.










