Jul 08,2022 07:41
  • నాలుగు డిసిసిబిల పరిధిలో రుణాలు బంద్‌
  • సగం పిఎసిఎస్‌ల్లోనూ అంతే
  • మిగతా చోట్లా అప్పుల మంజూరులో జాప్యం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఖరీఫ్‌ వేళ రైతులకు సహకార రుణ వితరణ ప్రమాదంలో పడింది. ఆర్థికంగా నిర్వీర్యదశలో ఉన్న కర్నూలు, కడప, అనంతపురం, ఏలూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల (డిసిసిబి) పరిధిలో రుణాల పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. తమ వద్ద నగదు లేదని సదరు జిల్లాల్లో సహకార సంస్థలు అప్పులివ్వట్లేదు. పరిస్థితిలో మార్పొస్తే, పాత బకాయిల వసూళ్లు మెరుగైతే, ప్రభుత్వం నుండి ఆర్థిక సహకారం అందితే అప్పుడే అప్పులిస్తామంటున్నాయి. ఆర్థికంగా మెరుగ్గా ఉన్న, బకాయిల వసూళ్లుబాగున్న ఇతర డిసిసిబిల పరిధిలో సైతం పంట రుణాల మంజూరు ఆలస్యమవుతోంది. లోన్‌ కోసం అర్జీ పెట్టుకున్నాక రుణ మంజూరుకు కనీసం పదిహేను రోజుల నుండి నెల, అంతకంటే ఎక్కువ సమయమే పడుతోంది. అందుక్కూడా రుణ బకాయిల సమస్యనే ముందుకు తెస్తున్నారు. ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధమవు తున్న రైతులు పెట్టుబడుల కోసం సహకార సంస్థల దిక్కు చూస్తుండగా అక్కడ వారికి అప్పుపుట్టట్లేదు. దాంతో కోఆపరేటివ్‌ రుణాలపై ఆధారపడ్డ లక్షలాది మంది అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
 

                                                                       నష్టాల్లో సగం సొసైటీలు

రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల పైలుకు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పిఎసిఎస్‌) ఉండగా, వాటిలో సగం నష్టాల్లో ఉన్నాయి. నష్టాల్లో ఉన్న వాటిలోనూ గణనీయమైన సంఖ్యలో సొసైటీలు ఆర్థికంగా కోలుకోలేని స్థాయికి చేరుకున్నాయని ప్రభుత్వం ఇటీవల ప్రైవేటు కన్సెల్టెంట్‌తో చేయించిన అధ్యయనంలో తేలింది. అటువంటి సొసైటీల్లో సభ్యులుగా ఉన్న రైతులకు సైతం ఈ తడవ పంట రుణాల మంజూరు నిలిచిపోయిందని చెబుతున్నారు. జాతీయ బ్యాంకుల కంటే సహకార బ్యాంకులు రుణ బకాయిల వసూళ్లను ముమ్మరంగా చేపడుతున్నాయి. రూ.లక్ష పంట రుణంపై ముక్కుపిండి రూ.7 వేలు వడ్డీ కట్టించుకుంటున్నాయి. టర్మ్‌ లోన్లనూ అలాగే వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వరంగంలోని సంస్థలే అయినప్పటికీ, ప్రభుత్వం సున్నా వడ్డీ పథకంలో వడ్డీ సొమ్ము రీయింబర్స్‌ చేస్తుందన్న గ్యారంటీ ఉన్నప్పటికీ, అవి వచ్చే వరకు ఆగకుండా ముందుగానే అసలు, వడ్డీ కలిపి వసూలు చేస్తున్నాయి. ఇంతగా రైతులపై ఒత్తిడి చేసి వసూళ్లు చేస్తున్నప్పటికీ నష్టాలు తీరట్లేదు.
 

                                                                    ప్రభుత్వం వైపు చూపు

రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప మూడు డిసిసిబిలూ ఆర్థికంగా నిర్వీర్యస్థాయిలో ఉన్నాయి. వాటి లైసెన్స్‌లు సైతం రద్దయ్యే పరిస్థితి నెలకొంది. ఏలూరు డిసిసిబి కూడా అంతే. ఇంకా ఒకటి రెండు డిసిసిబిలు ప్రమాదపుటంచున ఉన్నా యని సమాచారం. రాష్ట్రంలోని సగం పిఎసి ఎస్‌లు నష్టాల్లో ఉండగా వాటిలో సగం కోలుకోలేని స్థితిలో ఉన్నాయి. నాబార్డ్‌, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించకపోతే సదరు సంస్థలు మూతబడే అవకాశాలున్నాయని కోఆపరేటివ్‌ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నిధులిచ్చి ఆదుకుంటేనే రైతులకు కొద్దిపాటి ఊరట కలుగుతుంది. రాష్ట్ర రుణ ప్రణాళికలో ఆప్కాబ్‌ వాటా గణనీయం. ఆప్కాబ్‌ నుండి రూ.15 వేల కోట్ల పంట రుణాలు, రూ.5 వేల కోట్ల టర్మ్‌లోన్లు, మొత్తంగా రూ.25 వేల కోట్ల రుణ వితరణ జరుగుతోంది. ఆప్కాబ్‌ ఇచ్చే మొత్తం రుణాల్లో 73 శాతం కేవలం వ్యవసాయ, అనుబంధ రంగాలకే ఇస్తోంది. కౌలు రైతులకు సైతం సహకార బ్యాంకులే కొంత మేర అప్పులిస్తున్నాయి. కోఆపరేటివ్స్‌ నిర్వీర్యమైతే వ్యవసాయరంగానికి, రైతులకు నష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.