Jun 01,2022 08:28
  • రాజధానికి రాలేమంటున్న సంస్థలు
  • రోడ్డు కూడా లేదంటూ అభ్యంతరాలు
  • డబ్బులు చెల్లించిన సంస్థలూ వెనుకడుగు
  • 59 సంస్థల్లో ప్రారంభానికి నోచుకున్నది ఐదే

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో కనీస సదుపాయాలు కూడా లేవంటూ పలు ప్రముఖ సంస్థలు ముఖం చాటేస్తున్నాయి. రాజధాని పరిధిలో భూములు పొందిన సంస్థలు పూర్తిగా డబ్బులు చెల్లించినా నిర్మాణాలకు తగిన సదుపాయాలు లేకపోవడంతో ముందుకు రావడం లేదు. నిర్మాణం చేపడదామనుకున్న సమయంలో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సిఆర్‌డిఏ) నుండి అనేక ఇబ్బందులు ఎదురవడం, తమకు కేటాయించిన స్థలాల వద్దకు కనీసం రోడ్డు కూడా లేకపోవడంతో తాము అడుగు ముందుకు వేయలేకపోతున్నామని పలు సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. ఇటీవల దీనిపై సిఆర్‌డిఏ అధికారులను కూడా కలిసి తమ అభ్యంతరాలను తెలిపారు.
     విశ్వవిద్యాలయాలు, వైద్యారోగ్య తదితర రంగాలకు సంబంధించిన 59 ప్రముఖ ప్రయివేటు సంస్థలకు రాజధానిలో భూములు కేటాయించారు. వీటిల్లో 40 సంస్థలు పూర్తిగా వారికి నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించాయి. 23 సంస్థలు అగ్రిమెంటు కూడా పూర్తి చేసుకున్నాయి. తీరా పనులు ప్రారంభించే సమయంలో సిఆర్‌డిఏ పలు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సదరు సంస్థలు వాపోతున్నాయి. సంస్థలకు కేటాయించిన భూములను సర్వే చేయాలని, సర్వే నెంబర్లలో తప్పులు వచ్చాయని, కేటాయించిన మొత్తం సరిగాలేదని సిఆర్‌డిఎ అభ్యంతరాలు తెలియజేసింది. దీంతో డబ్బు చెల్లించిన సంస్థలు కూడా అక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధపడటం లేదు. సిఆర్‌డిఏ ల్యాండ్‌ రెవెన్యూ అధికారుల నుండి తమకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయనీ పలువురు తెలిపారు.

  • సిఆర్‌డిఏ పరిధిలో మూడు యూనివర్శిటీలకు భూములు కేటాయించారు. వీటిల్లో విట్‌, ఎస్‌ఆర్‌ఎం, అమృత ఉన్నాయి. అమృత యూనివర్శిటీ పనులు మొదలుపెట్టింది. మిగిలిన రెండు సంస్థలు ఇప్పటికే పూర్తిస్థాయి కార్యకలాపాలు మొదలుపెట్టాయి.
  • 11 స్కూళ్లకు భూములు కేటాయించగా ఆరు స్కూల్స్‌ పూర్తిస్థాయిలో నిర్దేశిత డబ్బులు చెల్లించాయి. వీటిల్లో మూడు స్కూల్స్‌ అగ్రిమెంటు కూడా చేసుకున్నాయి.
  • హెల్త్‌ కేర్‌ రంగంలో నాలుగు సంస్థలకు భూములు కేటాయించారు. వీటిల్లో నాలుగు సంస్థలు డబ్బు చెల్లించాయి. మూడు అగ్రిమెంటు చేసుకున్నాయి. పనులు మొదలుపెట్టలేదు.
  • క్రీడా సంస్థలు రెండిటికి రెండూ అగ్రిమెంటు కూడా చేసుకున్నాయి.
  • 15 స్టార్‌ హోటళ్లకు భూములు కేటాయించగా 13 సంస్థలు డబ్బులు చెల్లించాయి. వీటిలో రెండు సంస్థలు మాత్రమే అగ్రిమెంటు చేసుకున్నాయి. వీటిలో ఏఒక్కటీ పనులు ప్రారంభించలేదు.
  • ఐదు ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలకు భూములు ఇవ్వగా నాలుగు, 14 ఇతర సంస్థలకు భూములు కేటాయించగా వాటిలో ఐదు సంస్థలు మాత్రమే అగ్రిమెంటు చేసుకున్నాయి.

                                                       అభ్యంతరం లేదు : సిఆర్‌డిఎ

రాజధాని ప్రాంతంలో భూములు పొందిన సంస్థలు నిర్మాణాలు చేపడితే తమకు ఎటువంటి అభ్యంతరమూ లేదని సిఆర్‌డిఏ ఉన్నతాధికారులు తెలిపారు. ఏ కారణంగానో వారు ముందుకు రావడం లేదన్నారు. అమృత యూనివర్శిటీ పనులు ప్రారంభించిందన్నారు. మిగిలిన సంస్థలు ముందుకొస్తే సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.