న్యూయార్క్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య(ఏటిపి) తాజా ర్యాంకింగ్స్‌లో మాజీ టాప్‌సీడ్ ఆటగాడు, 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయాడు. సోమవారం ప్రకటించిన ఏటిపి ర్యాంకింగ్స్‌లో నాదల్ 13వ ర్యాంక్‌లో నిలిచాడు. గాయం కారణంగా ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండోరౌండ్‌లోనే ఓడిన నాదల్.. ఇండియన్ వెల్స్ టోర్నీ రన్నరప్‌గా మాత్రమే నిలువగలిగాడు. దీంతో ఏకంగా 600పాయింట్లు కోల్పోయాడు. 2005, ఏప్రిల్ తర్వాత ఏటిపి ర్యాంకింగ్స్‌లో నాదల్ టాప్-10లో చోటు కోల్పోవడం ఇదే ప్రథమం. ఇక తాజా ర్యాంకింగ్స్‌లో యువ ఆటగాడు, స్పెయిన్‌కు చెందిన కార్లోస్ అల్కరాజ్ అగ్రస్థానానికి ఎగబాకాడు. ఆదివారం జరిగిన ఇండియన్ వెల్స్ ఫైనల్లో అల్కరాజ్.. రష్యాకు చెందిన డానియెల్ మెద్వదెవ్‌పై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఇదే క్రమంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 టైటిల్ విజేత నొవాక్ జకోవిచ్ రెండోస్థానానికే పరిమితమయ్యాడు. ఇక భారత్‌కు చెందిన సుమిత్ నాగల్ 5స్థానాలు మెరుగుపరుచుకొని(374), ముకుంద్ శశికుమార్(401), రామ్‌కుమార్ రామ్‌నాథన్(411), ప్రజ్ఞేష్ గుణ్ణేశ్వరన్(431) స్థానాల్లో నిలిచారు. ఇక పురుషుల డబుల్స్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ రన్నరప్ రోహన్ బొప్పన్న 11, యుకీ బాంబ్రీ(75), సాకెత్ మైనేని(77), జీవన్ నెడుంఛెజియన్(84), శ్రీరామ్ బాలాజీ(89) టాప్-100లో చోటు దక్కించుకున్నారు.
ఏటిపి ర్యాంకింగ్స్..
1. కార్లోస్ అల్కరాజ్(స్పెయిన్) : 7420 పాయింట్లు
2. నొవాక్ జకోవిచ్(సెర్బియా) : 7160 పాయింట్లు
3. స్టెఫొనాస్ సిట్సిపాస్(గ్రీక్) : 5770 పాయింట్లు
4. కాస్పర్ రూఢ్(నార్వే) : 5560 పాయింట్లు
5. డానియెల్ మెద్వదెవ్(రష్యా) : 4330 పాయింట్లు
6. ఫిలిక్ అగర్(కెనడా) : 3415 పాయింట్లు
7. ఆండ్రీ రుబ్లేవ్(రష్యా) : 3390 పాయింట్లు
8. హోల్జర్ రూనే(డెన్మార్క్) : 3325 పాయింట్లు
9. హుబర్డ్ హుర్క్రరాజ్(పోలండ్) : 3065 పాయింట్లు
10. టేలర్ ఫ్రిట్జ్(అమెరికా) : 2975 పాయింట్లు










