Apr 03,2023 21:03
  • ఐపిఎల్‌ నుంచి విలియమ్సన్‌ ఔట్‌

ముంబయి: గుజరాత్‌ టైటాన్స్‌ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆటగాడు, మాజీ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఐపిఎల్‌ టోర్నీ మొత్తానికి దూరయ్యాడు. కుడి మోకాలికి పట్టీతో, రెండు కర్రల సాయంతో నిల్చొని ఉన్న ఫొటోను విలియమ్సన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. 'థాంక్యూ గుజరాత్‌ టైటన్స్‌. గత రెండు రోజులుగా నాకు అన్నివిధాలా సపోర్ట్‌ చేసిన మంచి మనుషులకు థాంక్స్‌. కాలి గాయం నుంచి కోలుకునేందుకు స్వదేశం బయలుదేరుతున్నాను' అని క్యాష్షన్‌ రాశాడు. ఆ పోస్ట్‌ చూసిన ఫ్యాన్స్‌ 'విలియమ్సన్‌ తొందరగా కోలుకో' అంటూ కామెంట్లు పెడుతున్నారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తుండగా ఈ కివీస్‌ బ్యాటర్‌ గాయపడ్డాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ కొట్టిన బంతిని బౌండరీ వద్ద ఎగిరి ఆపేందుకు ప్రయత్నించి కింద పడ్డాడు. అనంతరం నొప్పితో విలవిలలాడుతూ మైదానం వీడాడు. స్కానింగ్‌లో అతని కుడిమోకాలు బెణికినట్టు గుర్తించారు. దాంతో, న్యూజిలాండ్‌ క్రికెట్‌ తమ స్టార్‌ ప్లేయర్‌ను స్వదేశానికి రావాలని కోరింది.