- 6,755 ఏకోపాధ్యాయ పాఠశాలలు
- మండలిలో మంత్రి బొత్స సమాధానం
- తప్పుడు సమాచారం చెప్పారన్న పిడిఎఫ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 717 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. 2019 నుంచి 14,219 మంది ఉపాధ్యాయ నియామకాలు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 6,755 ఉన్నాయని చెప్పారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సందర్భంగా ఉపాధ్యాయ ఖాళీ పోస్టులు, కొత్త డిఎస్‌సి వివరాలు చెప్పాలని టిడిపి సభ్యులు అడిగిన ప్రశ్నపైనా, ఏకోపాధ్యాయ పాఠశాలల గురించి స్వతంత్ర ఎమ్మెల్సీ పి రఘువర్మ అడిగిన ప్రశ్నపైనా సోమవారం చర్చ జరిగింది. 2018లో ఎంపికైన 7,254 మందికి, 2008లో ఎంపికైన 1910 మందికి, 2019 ప్రత్యేక డిఎస్‌సి ద్వారా 521 మందిని నియమించామని చెప్పారు. ప్రస్తుతం 5251 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వీటిలో 4534 మంది డిఎస్‌సి-1998 అభ్యర్థులకు త్వరలో నియమకాలు అందిస్తే ఇక మిగిలేది 717 ఉపాధ్యాయ పోస్టులే అని చెప్పారు. ఉపాధ్యాయ ఖాళీల గురించి ప్రస్తావించని మంత్రి గత డిఎస్‌సిల్లో మిగిలిన పోస్టులకు తాము నియామకాలు ఇచ్చామని చెప్పారు. మంత్రి చెప్పిన సమాధానంపై పిడిఎఫ్ ఎమ్మెల్సీలు వి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ లక్ష్మణరావు, షేక్ సాబ్జీ, ఐ వెంకటేశ్వరరావు, స్వతంత్ర ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. వేసిన ప్రశ్నకు చెప్పిన సమాధానానికి పొంతన లేదని, అదేవిధంగా ఉపాధ్యాయ ఖాళీ పోస్టులపై తప్పుడు సమాచారం అందించారని విమర్శించారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క డిఎస్‌సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఇడి, డిఇడి చేసిన నిరుద్యోగులు డిఎస్‌సి కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో సుమారు 50,677 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని తెలిపారు. మంత్రి మాట్లాడుతూ కేంద్రానికి ఇచ్చిన సమాచారం కరోనాకు ముందని తెలిపారు. తాము పాటిస్తున్న మార్గదర్శకాల ప్రకారం 717 పోస్టులే ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. పిడిఎఫ్ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం జివో 117 తీసుకొచ్చి టీచర్ పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించిందని, రేషనలైజేషన్ పేరుతో పోస్టులను కుదించిందని, రెండు మాధ్యమాలను ఒక మాధ్యమానికే కుదించిందని మండిపడ్డారు. తరగతి గదిలో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు ఉపాధ్యాయులకు అదనపు పీరియడ్లు అప్పగించి వారిపై అదనపు భారం మోపుతుందన్నారు. కొత్తగా టీచర్లు అవసరం లేదన్నట్లుగా ప్రభుత్వం చెబుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని చెబుతున్న ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులను ఎందుకు భర్తీ చేయడం లేదని పిడిఎఫ్ సభ్యులతో పాటు బిజెపి సభ్యులు వాకాటి నారాయణ రెడ్డి ప్రశ్నించారు. ఏకోపాధ్యాయ పాఠశాలలపై కూడా మంత్రి చెప్పిన సమాధానంపై పిడిఎఫ్ సభ్యులు అంసతృప్తి వ్యక్తం చేశారు. 2021-22 యుడైస్ లెక్కల ప్రకారం 12,386 పాఠశాలలు ఉన్నాయని సభ్యులు చెప్పారు. ఉపాధ్యాయులు లేక ప్రాథమిక విద్య చాలా ఇబ్బంది పడుతోందన్నారు. రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు కాకుండా అవసరమైన టీచర్లతో నడపగలమని మంత్రి చెప్పగలుగుతారా అని ప్రశ్నించారు.










