Oct 03,2020 19:35

డిఇఒకు ధర్నా నోటీసు ఇస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

6న డిఇఒ ఆఫీసు వద్ద యుటిఎఫ్‌ ధర్నా
ప్రజాశక్తి-గుంటూరు
ఉపాధ్యాయుల దీర్ఘకాల పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోసం 6వ తేదీన డిఇఒ కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నట్లు యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.ప్రేమ్‌కుమార్‌, కె.నాగమల్లేశ్వరరావు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతూ శనివారం డిఇఒ ఆర్‌.ఎస్‌.గంగా భవానీని కలిసి ధర్నా నోటీసు అందచేశారు. డిఇఒ కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోవట్లేదని, ఉపాధ్యాయులు ప్రతి రోజూ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ప్రాధేయపడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అడిగి, అడిగి విసిగి వేసారి ధర్నాకు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు.మెడికల్‌ బిల్లుల మంజూరులో జాప్యం నివారించాలని, వెబ్‌సైట్‌ అప్‌డేట్‌ చేయాలని, కార్యాలయంలో ఇచ్చిన బిల్లుల్లో మిస్సైన వాటిపై విచారణ చేయాలని, సర్వీసు రెగ్యులరైజేషన్‌, ప్రొబేషన్‌ డిక్లరేషన్‌లో సమస్యలు పరిష్కరించాలని, తీవ్ర జాప్యం నివారించాలని, ఐటి విభాగ సమస్యలు పరిష్కరించటానికి చర్యలు తీసుకోవాలని, ఎంఇఒలకు, ఎఫ్‌ఎసిలు నిబంధనల ప్రకారం ఇవ్వాలని, తాడేపల్లి, మంగళగిరి ఎంఇఒల అక్రమ ఎఫ్‌ఎసి ఉత్తర్వులు రద్దు చేయాలని, తదితర సమస్యలతో కూడిన ధర్నా నోటీసును డిఇఒకు అందచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి ఎండి.షకీలా బేగం, ఆడిట్‌ కన్వీనర్‌ ఎన్‌.వి.జగదీష్‌కుమార్‌, ఆడిట్‌ సభ్యులు కె.ప్రభూజీ పాల్గొన్నారు.