- నేటికీ నివేదిక బయటపెట్టని కేంద్ర ప్రభుత్వం
- ప్రయివేటీకరణతో పెరుగుతున్న ప్రమాదాలు
ప్రజాశక్తి-విజయనగరం ప్రతినిధి : పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కూనేరు వద్ద హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం జరిగి నేటికి ఆరున్నరేళ్లు కావస్తోంది. ఈ ఘటనలో 41 మంది ప్రయాణికులు మృతి చెందారు. ట్రాక్ బలహీనం వల్లే రైలు ప్రమాదం జరిగిందని, ఇది ముమ్మాటికీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ వైఫల్యమేనని అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టినప్పటికీ, నివేదికను నేటికీ బయటపెట్టలేదు. దీంతో, ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని అనుమానాలు బలపడుతున్నాయి. తాజాగా ఈ నెల రెండున ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంతో జిల్లా వాసులు కూనేరు ఘటనను గుర్తు చేస్తున్నారు.
అమలు కాని హామీలు... నేటికీ దయనీయంగా మృతుల కుటుంబాల పరిస్థితి 2017 జనవరి 21వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో కూనేరు రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఒడిశా మీదుగా విశాఖ వైపు వస్తున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌లోని తొమ్మిది బోగీలు పూర్తిగా పట్టాలు తప్పడంతో, ఇందులోని నాలుగు బోగీలు పల్టీకొట్టి ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో 41 మంది దుర్మరణం చెందగా, 65 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన ఏడుగురు ఉన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున ఆర్థిక సాయంతోపాటు మృతుల పిల్లలకు మెరుగైన విద్య అందిస్తామని, కుటుంబ సభ్యులకు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీతో కూడిన రుణాలిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇచ్చినప్పటికీ ఆచరణలో ఆర్థిక సాయం తప్ప, మిగిలినవేవీ అమలు కాలేదు. దీంతో, ఆయా కుటుంబాల పరిస్థితి నేటికీ దీనంగా ఉంది.
- విద్రోహ శక్తుల కుట్ర అంటూ అప్పట్లో తప్పుడు ప్రచారం
కూనేరు రైలు ప్రమాద సంఘటన అప్పట్లో రాష్ట్రాన్ని కలచివేసింది. దీంతో, ప్రమాదం వెనుక సంఘ విద్రోహ శక్తుల కుట్ర ఉండి ఉండవచ్చంటూ విమర్శల నుంచి బయటపడేందుకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు అప్పట్లో అనుమానాలు రేకెత్తించారు. ప్రమాదానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యమేనంటూ ప్రతిపక్ష పార్టీలు, ప్రజానీకం పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఎస్‌ఐఎ (నేషనల్ ఇన్విస్టిగేషన్ అథారిటీ), సిఐడి, ఎఫ్‌ఎస్‌ఎల్ (ఫోరెన్సిక్ లేబరేటరీ), పోలీస్ శాఖల ఆధ్వర్యాన వేర్వేరుగా విచారణ చేపట్టారు. ఇప్పటికీ నివేదికను బయటపెట్టకపోవడం గమనార్హం. దీంతో, కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను కప్పిపుచ్చుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి.
- పెరుగుతున్న రైళ్లు... తగ్గుతున్న సిబ్బంది
రైల్వే శాఖలో అనుసరిస్తోన్న ప్రయివేటీకరణ విధానాలే ప్రమాదాలకు కారణం అవుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రైల్వేలో ట్రాఫిక్, సిగల్ తదితర విభాగాల్లో నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాక రైల్వే రిక్రూట్‌మెంట్లు క్రమంగా తగ్గుతున్నాయి. చివరకు రైల్వేకు గుండెకాయలాంటి ఇంజనీరింగ్ విభాగంలో ట్రాక్ నిర్మాణం, పునరుద్ధరణ, మరమ్మతుల పనులు కూడా కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అప్పగించింది. రైలు పట్టాల మార్పు మొదలుకుని, పట్టాలు ఎప్పటికప్పుడు పటిష్టపర్చే ప్యాకింగ్, లిఫ్టింగ్ వంటి పనుల్లో ఈ జిల్లా వాసులు ఆరితేరారు. వాల్తేరు డివిజన్ పరిధిలోని విశాఖ - రాయగడ, విశాఖ - కిరండోల్, విజయనగరం-పలాస వరకు ట్రాక్ మరమ్మతుల పనుల్లో సుమారు ఐదు వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. పర్మినెంట్ సిబ్బంది సంఖ్య గణనీయంగా తగ్గింది. ఘటన జరిగిన పార్వతీపురం రైల్వే ఇంజనీరింగ్ సెక్షన్‌లో పదేళ్ల క్రితం 124 మంది ట్రాక్‌మెన్లు ఉంటే, ప్రస్తుతం ఆ సంఖ్య 78కి చేరింది. మరోవైపు రైళ్ల సంఖ్య 87 నుంచి 111కి పెరిగింది. అదనంగా రైల్వే ట్రాక్‌ల నిర్మాణం జరుగుతోంది. అందుకు తగ్గట్టు సిబ్బంది లేకపోవడం, కాంట్రాక్టు పనులపై ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ తగ్గుముఖం పట్టడంతో ట్రాక్ బలహీనపడడం, వాటిని ఎప్పటికప్పుడు పటిష్టంగా తీర్చిదిద్దకపోవడం వల్లే కూనేరు ఘటన జరిగిందని ఆ శాఖలో ఉద్యోగులే చెబుతున్నారు. రైల్వేలో ప్రయివేటీకరణ విధానాలకు స్వస్తి చెప్పాలని, ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే కూనేరు, బాలాసోర్ వంటి ఘటనలు పునరావృతం అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.










