ప్రజాశక్తి- కలకడ (అన్నమయ్య) : నాటు సారాయిని తయారు చేయడానికి ఉంచిన 400 లీటర్ల ఊటను ధ్వంసం చేసినట్లు కలకడ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగేంద్ర తెలిపారు. మండలంలోని ఏనుగొండ పాలెం పంచాయితీ ఎగువ తాండ గ్రామ సమీపంలో నాటు సారా తయారు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న సిఐ, కలకడ, కేవీ పల్లి, గుర్రంకొండ ఎస్సైలు సిబ్బందితో కలిసి శనివారం ఉదయం కార్టూన్ చర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఎగువుతాండా పరిసర ప్రాంతాల్లో నాటు సారాను తయారు చేయడానికి ఉంచిన 400 లీటర్ల ఊటను ధ్వంసం చేయగా, ఈ క్రమంలో నాటు సారా తయారు చేస్తున్న గ్రామ సరిహద్దుల్లో 10 లీటర్ల నాటుసారా లభించినట్లు తెలిపారు. నాటు సారా తయారు చేసిన వ్యక్తులు పోలీసులు వస్తున్న విషయం గమనించి పరారయ్యారని అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సిఐ మాట్లాడుతూ ... గ్రామాలలో ఎవరైనా నాటు సారా తయారు చేయడానికి ప్రయత్నించినా, తయారుచేసినా నాటు సారా ని సరఫరా చేసిన ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కలకడ, గుర్రంకొండ, ఎస్సైలు తిప్పేస్వామి దిలీప్ కలకడ, కెవిపల్లి, గుర్రంకొండ పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.










