Feb 28,2023 20:52

మాట్లాడుతున్న కలెక్టర్‌

మాట్లాడుతున్న కలెక్టర్‌
యువత పరిశోధనలపై దృష్టి సారించాలి
నెల్లూరు:ఎంతో మంది శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ప్రతిభ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో భారత దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారని, నేటి యువత అటువంటి వారందరినీ స్ఫూర్తిగా తీసుకొని పరిశోధనలపై దష్టి సారించాల్సిన అవసరం వుందని కలెక్టర్‌ కె.వి.ఎన్‌. చక్రధర్‌ బాబు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో హౌస్‌ సర్జన్‌ విద్యార్ధులకు ఏర్పాటు చేసిన ఓరియెంటేషన్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్ధులనుద్ధేశించి మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సరాలుగా వైద్య విద్యను అభ్యసించి నేడు ప్రాక్టికల్‌ గా వైద్య విద్యను నేర్చుకునేందుకు హౌస్‌ సర్జన్‌ షిప్‌ లోకి అడుగిడుతున్న వైద్య విద్యార్ధులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.
అయితే హౌస్‌ సర్జన్‌ విద్యార్ధులకు కొన్ని పరిమితులు వుంటాయని వాటికి లోబడి సీనియర్‌ వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా కషి చేయాలన్నారు. గత నాలుగు సంవత్సరాల కాలంలో థీయరీ క్లాసుల ద్వారా నేర్చుకున్న విషయాలను, నేడు ప్రాక్టికల్‌ గా నేర్చుకుంటున్న విషయాలను సమన్వయం చేసుకుంటూ వైద్యం అందించడంలో ప్రతి వైద్య విద్యార్ధి ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. రానున్న రోజుల్లో వైద్యం అందించడంలో నేడు హౌస్‌ సర్జన్‌ గా నేర్చుకున్న విషయాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. ఇప్పటి నుండే ప్రతి వైద్య విద్యార్ధి నిర్ధిష్టమైన లక్ష్యాన్ని నిర్ధేశించుకొని వైద్య విద్య పూర్తి అయిన తరువాత డాక్టర్లుగా పేదలకు వైద్యం అందించడంలో కషి చేస్తూ వైద్య కళాశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. గత రెండు సంవత్సరాల కాలంలో కోవిడ్‌ సంధర్భంగా జిజిహెచ్‌ నందు కోవిడ్‌ పేషెంట్స్‌ కు మెరుగైన వైద్యం అందించి జిల్లా కు మంచి పేరు తీసుకురావడంలో వైద్యలు ఎంతగానో కషి చేశారన్నారు. వైద్యవిద్యార్ధులకు జాతీయ సైన్స్‌ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సైన్స్‌ మూఢ నమ్మకాలను ప్రక్కన పెట్టి వాస్తవాన్ని చూపిస్తూ ప్రజలను విజ్ఞానవంతులను చేయడం జరుగుతుందన్నారు. సైన్స్‌ ను పెంపొందించేలా ప్రతి స్కూల్స్‌, కళాశాలల నందు ల్యాబ్స్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా ప్రమాణాలను ప్రభుత్వ రంగంలో మెరుగుపర్చేందుకు, ఆయుష్మాన్‌ భారత్‌, నాడు - నేడు వంటి వినూత్నమైన కార్యక్రమాలను చేపడుతున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ప్రతి జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో ల్యాబ్స్‌ ను మెరుగుపర్చేందుకు నిధులు కేటాయించడం జరుగుచున్నదన్నారు. అలాగే సైన్స్‌ , ప్రొఫెషనల్‌ కోర్సుల్లో మరింత ఎక్కువ మంది విద్యార్ధులు అడ్మీషన్లు తీసుకొనేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా వున్న వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దష్టి సారిస్తున్నామన్నారు. ఆరోగ్య శ్రీ పథకంలో సామాన్య మానవునికి మెరుగైన వైద్యం అందజేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ డా. శిద్దా నాయక్‌, ఎపిఎంఎస్‌ఐడిసి ఈ ఈ విజయభాస్కర్‌, ఆసుపత్రి అభివద్ధి సొసైటీ కో ఆర్డినేటర్‌ సునంద, వివిధ విభాగాల హెచ్‌.ఓ.డి లు, హౌస్‌ సర్జన్‌ విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.