Dec 17,2022 19:27

పొలంలో యూరియా చల్లుతున్న రైతు

అమ్మకాలు నిలిపేసిన వ్యాపారులు
ఆర్‌బికెల్లోనూ అందని వైనం
పట్టని అధికారులు
పక్క మండలాల్లో కొనుగోలు చేస్తున్న రైతులు
ప్రజాశక్తి-గుర్రంకొండ : కాలం ఏదైనా వ్యవసాయమే తమ జీవన విధానమని, తాము జీవిస్తూ పది మందికి అన్నం పెడుతూ మరణించేంత వరకూ అన్నదాతగానే ఉండాలని కష్టనష్టాలకు ఓర్పుతో నేర్పుతో రైతులు వ్యవసాయం సాగిస్తున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటున్నామన్న హామీలను నీటిపై బుడగల్లాగా మారాయి. ఈ సీజన్లో మండల వ్యాప్తంగా వందలాది ఎకరాల్లో వరి, టమోటా, మిరప, తదితర పంట సాగవుతున్నాయి. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడంతో రైతులు పక్క మండలాలకు వెళ్లి కొనుగోలు చేసే పరిస్థితి. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఎరువులు కావాల్సిన రైతులు కియోస్క్‌ వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంది. అయితే వివరాలు నమోదు చేసుకున్నా వ్యవసాయ అధికారులు ఎరువులను సకాలంలో అందించడం లేదని రైతులు వాపోతున్నారు.
అమ్మకాలు నిలిపేసిన వ్యాపారులు
ప్రభుతం నిర్ణయించిన ధరలకు యూరియాను అమ్మాల్సిన వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఎంఆర్‌పి ధరలకు అమ్మలేమని, అధిక లాభాలు ఉంటే తప్ప వ్యాపారం నడవదని యూరియా జాడని లేకుండా మూకుముడిగా అమ్మకాలను నిలిపివేశారు. మండలంలో సుమారు 15 ఫెర్టిలైజర్‌ షాపులు ఉన్నాయి. గతంలో 45 కిలోల యూరియా ఎంఆర్‌పి ధర రూ.270 ఉండగా రూ.350 నుంచి 380 వికరిస్తుండేవారు. మూడు నెలల మునుపు విజిలెన్స్‌ అధికారులు దాడి చేసి మండల కేంద్రంలోని రెండు షాపులకు రూ.30 వేల నుంచి రూ.70 వేల వరకు జరిమానా విధించారు. ఎంఆర్‌పి ధరలకు అమ్మ లేమని మిగిలిన మండలంలో ఉన్న షాపు యజమానులు అందరూ మూకుముడిగా యూరియా అమ్మకాలను నిలిపివేశారు.
ఇబ్బందుల్లో రైతులు
మండలంలో సాగు విస్తీర్ణం బట్టి ఎరువులను అందించాల్సి ఉంది. ఈ సీజన్లో వర్షాలు బాగా పడుతుండడంతో భూగర్భజలాలు పెరిగి వరినాట్లు ఊపందుకున్నాయి. వరి పంటకు అవసరమైన మేర యూరియాను వినియోగించాల్సి ఉంది. వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం రెండు విడతలకు ఎకరాకు 50 కిలోల కాంప్లెక్స్‌ ఎరువులు, వంద కిలోల యూరియా వేయాలి. వ్యాపారులు మూకుమ్మడిగా యూరియా అమ్మకాలను ఆపివేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆర్‌బికెల్లోనూ అందని వైనం
రైతులకు ఆర్‌బికె కేంద్రాల్లో వారికి అవసరమైన ఎరువులను అందించాల్సి ఉంది. అయితే మండలంలోని ఏ ఒక్క ఆర్‌బికెల్లోనూ ఎరువులు అందుబాటులో లేవు. యూరియా కావాల్సిన రైతులు పక్క మండలాలకు వెళ్లి కొనుగోలు చేసుకుంటున్నారు.
పట్టించుకోని అధికారులు
మండలంలో ఉన్న ఫెర్టిలైజర్‌ షాపు యజమానలు యూరియా బస్తాపై రూ.50 నుండి రూ.వంద అదనంగా అమ్మినప్పుడు అధికారులు పట్టించుకోలేదు. కొంత మంది రైతులు విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేసి దాడులు చేయించారు. అప్పటి నుంచి షాపు యజమానులు యూరియా అమ్మడం నిలిపివేశారు. ఇప్పుడు కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. వ్యాపారులపై అధికారులు చర్యలు తీసుకోవాలి.
- రమేష్‌బాబు, ఎపి రైతు సంఘం జిల్లా నాయకులు,
యూరియా దొరకడం లేదు
వరి, పాడి పశువుల మేతకు మొక్కజొన్న, జొన్న, సజ్జ పశుగ్రాసానికి ఎక్కువగా యూరియా అవసరం అవుతుంది. నాలుగు నెలలుగా మండలంలో యూరియా విక్రయాలు పూర్తిగా ఫెర్టిలైజర్‌ షాప్‌ యజమాను నిలిపివేశారు. ప్రక్క మండలాలకు వెళ్లి యూరియా తెచ్చుకోవలసిన దుస్థితి ఏర్పడింది. తక్షణం యూరియా సరఫరా చేయాలి.
- మౌలా, రైతు, రంగసముద్రం.
వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం
ఫర్టిలైజర్‌ షాపుల యజమానులు యూరియా అమ్మకాలు నిలిపివేయడం వాస్తవమే. రైతులకు యూరియా కొరత రాకుండా తగు జాగ్రత్త తీసుకుంటాం. యూరియా అమ్మకాలను నిలిపివేసిన యజమానులపై చర్యలు తీసుకుంటాం.
- రత్నమ్మ, ఎఒ, గుర్రంకొండ.