ప్రజాశక్తి - కలెక్టరేట్ (విశాఖపట్నం) : విశాఖపట్నం సముద్ర తీరానికి ఓ భారీ చెక్క పెట్టె కొట్టుకు వచ్చింది. స్థానిక ఆర్‌కె బిచ్ ఎఎంసికి ఎదురుగా ఉన్న తీరానికి శుక్రవారం రాత్రి అది చేరడంతో స్థానికులు త్రీ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రొక్లెయిన్ సాయంతో ఒడ్డుకు చేర్చారు. బీచ్‌లో ఉన్న సందర్శకులు ఆ చెక్క పెట్టెను చూసేందుకు ఎగబడ్డారు. భారీ ఆకృతిలోని చెక్క పెట్టె బ్రిటిష్ కాలం నాటిదిగా భావించిన పోలీసులు పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సుమారు వంద టన్నుల బరువున్న ఈ పురాతన పెట్టెను రెండు జెసిబిల సాయంతో పగలగొట్టారు. ఆ పెట్టెలో ఏముందన్న ఉత్కంఠ నెలకొంది. అందులో ఏమీలేకపోవడంతో ఉత్కంఠతకు తెరపడింది. అయితే, దీన్ని బోట్లకు లంగరు వేసే సమయంలో వినియోగిస్తారని అక్కడి జాలర్లు తెలిపారు.










