వాషింగ్టన్ : అమెరికాలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. థర్డ్‌వేవ్ ముంచుకొస్తోందంటూ నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య మూడున్నర కోట్లను దాటి.. 3,50,81,719లకు చేరింది. 6,25,363 మంది మరణించారు. వైట్‌హౌస్ చీప్ స్టాఫ్ అధికారికి కరోనా వైరస్ సోకిందని ప్రెస్ సెక్రెటరీ జెన్ పిసాకీ తెలిపారు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆ అధికారిని ఐసొలేషన్‌లో ఉంచిన్నట్లు చెప్పారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కూడా ఆయనకు వైరస్ సోకిందని స్పష్టం చేశారు. టెక్సాస్‌లో నిర్వహించిన రూఫ్‌టాప్ రిసెప్షన్‌కు హాజరైన తరువాత ఆ అధికారి వైరస్ బారిన పడినట్లుగా భావిస్తున్నామని అన్నారు. ఎంతమందికి వైరస్ సోకిందనే ప్రశ్నకు పిసాకీ సమాధానం ఇవ్వలేదు. కొన్ని నిబంధనల కారణంగా- ఆ విషయాన్ని వెల్లడించలేమని అన్నారు.
స్పీకర్ న్యాన్సీ పెలోసీ సిబ్బంది ఒకరు కరోనా వైరస్ బారిన పడ్డారు. గత వారం టెక్సాస్ లెజిస్లేచర్ సమావేశానికి హాజరైన అనంతరం పెలోసీ సిబ్బందిలో ఒకరికి వైరస్ సోకినట్లు తేలిందని స్పీకర్ అధికారిక ప్రతినిధి డ్రివ్ హ్యామ్మిల్ తెలిపారు. స్పీకర్ పెలోసీకి వైద్యపరీక్షలను నిర్వహించాల్సి ఉందని అన్నారు. కాగా, వైట్‌హౌస్ ''ఫుల్లీ వ్యాక్సినేటెడ్'' అని పిసాకీ చెప్పారు. అందరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని చెప్పారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కూడా కరోనా వైరస్ బారిన పడుతోన్న వారి సంఖ్య నామమాత్రంగా ఉందని సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ తెలిపింది. వైట్‌హౌస్ స్థాయి అధికారి, హౌస్ స్పీకర్ సిబ్బందికి వైరస్ సోకడాన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. దీన్ని థర్డ్‌వేవ్‌గా గుర్తించలేమని, అయినప్పటికీ.. ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.
టెక్సాస్ రూఫ్‌టాప్ రిసెప్షన్‌కు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా హాజరైనట్లు సమాచారం. ఆమెతో పాటు డెమొక్రటిక్ పార్టీకి చెందిన పలువురు ఈ రిసెప్షన్‌కు హాజరయ్యారు. స్పీకర్ న్యాన్సీ పెలోసీ సిబ్బంది, వైట్‌హౌస్ అధికారితో పాటు ఈ రిసెప్షన్‌లో పాల్గన్న ఆరుగురు డెమోక్రాట్లకు కరోనా సోకింది. ఈ రిసెప్షన్‌కు హాజరైన ఒక నర్సుకు కూడా వైరస్ సోకినట్లు మీడియా వెల్లడించింది. వీరంతా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ.. వైరస్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోందని.. ఇప్పటిదాకా అనుసరించిన కరోనా నిబంధనలను పున్ణసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని మీడియా పేర్కొంది.










