తుఫాన్ కంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాల ప్రభావమే పెనువిపత్తుగా మారుతోంది. నదులతో పాటు, వాగులు, వంకలు, కుంతలు పొంగి...చేలు, చెలకలు, ఆవాస ప్రాంతాలు, రహదారులు మునిగి జనజీవనం అతలాకుతలం అవుతోంది. నీటి దొరవులన్నీ మూసుకు పోవడంతో కొద్దిపాటి వర్షానికే రహదారులు, ఇళ్లు, ఆవాసాలు మడుగులౌతున్నాయి. మరోవైపు విలువైన నీటి సంపద సాగర గర్భం పాలౌతుంది.
చెరువులూ మాయమైపోతున్నాయి. అక్రమ లేఅవుట్లు, విస్తారంగా కట్టడాలు, పరిశ్రమలు వెలవడం, మరోవైపు వ్యవసాయ భూముల ఆక్రమణలు, భూకబ్జాలు, ఇష్టారాజ్యంగా రియల్ ఎస్టేట్ వంటివన్నీ...పల్లానికి పారే నీటిని దిగ్బంధనం చేస్తున్నాయి. జల సిరి ప్రసాదించే నీటి మడుగులను మింగేస్తున్నాయి. నిజానికి భారీ వర్షాలే కాదు. ఓ మోస్తరు వర్షం కురిసినా రోడ్లు జలమయమయ్యే పరిస్థితి ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల దుస్థితి. ఆంధ్రాలో 900 చెరువులు, 432 చిన్ని కాలువలు...తెలంగాణలో 300 చెరువులు, 312 చిన్న కాలువలు కనుమరుగయ్యాయి. ఆంధ్రాలో ఉన్న కొల్లేరు సరస్సు ఆక్రమణల చెరలో పదవ వంతు కుంచించుకు పోయింది. ఇది వర్షాకాలంలో వందల గ్రామాలను వరద ముప్పు నుండి కాపాడి వేల ఎకరాలకు పంట నీటిని ఇచ్చేది. ఆంధ్రా తమిళనాడు సరిహద్దుల్లో ఉప్పునీటి కయ్యగా ఉన్న పులికాట్ సరస్సు కూడా అంతే! ముందు చూపు లేకపోవడం, స్వార్థం, చట్టాలు కట్టుదిట్టంగా అమలు చేయకపోవడంతో ఇలాంటి దుస్థితి ఏర్పడుతోంది. ఒకప్పుడు లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాలు మునిగేవి. ఇప్పుడు నగరాలు, పట్టణాలు గ్రామాలు కూడా మునిగిపోతున్నాయి. ఔట్‌లెట్లు లేక పొలాల్లో విలువైన పంటలు కూడా మునిగిపోతున్నాయి. ఆకాశంలలో మబ్బేస్తే గుండెల్లో గుబులు పుడుతోంది. ఎకాఎకిన నీళ్లు రోడ్ల మీంచి ఇళ్ల లోకి జొరబడటంతో సర్వం వర్షార్పణమై ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నారు.
నిజానికి మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఈ దుస్థితి ఉంది. సముద్ర తీర రాష్ట్రాలకి తుఫాన్లు, వర్షాలు, వరదలు సర్వసాధారణం అయినప్పటికీ ముందుచూపు, సరైన నిర్వహణ లేక పెను ప్రమాదాలు సంభవించి, అధిక సంఖ్యలో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతోంది. విపత్తు నిర్వహణా సంస్థలు అలంకార ప్రాయం కావడంతో చిన్నపాటి వాన కూడా ఉప్పెనై జనావాసాల్ని ముంచెత్తుతోంది. లోతట్టు ప్రాంతాల్లో వెంచర్లు వెలవడం, పిల్లకాలువల పూడిక తీతకు సరైన ప్రాధాన్యత ఇవ్వక పోవడం, రోజురోజుకూ పెరుగుతున్న ఆవాసాల అభద్రతను ఆది లోనే గుర్తించక పోవడం జల విలయానికి కారణాలు. ఇకనైనా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ముంపు సమస్య మరింత జఠిలం అవుతుందనడంలో సందేహం లేదు. ఎక్కడ నీరు అక్కడ ఇంకేటట్టు కచ్చితంగా ప్రతీ చోటా ఇంకుడు కుంతలు తీయించాలి. పర్యావరణ పరిరక్షణ చట్టాలు, నీటి సంరక్షణ చట్టాలు ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయాలి. కాలువలు, చెరువులు, సరస్సులు, నీటి చెలమల కబ్జారాయుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ఆక్రమణలకు గురైన వాటిని ప్రత్యేక చట్టం ఉపయోగించి స్వాధీనం చేసుకోవాలి. పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి ఎప్పటికప్పుడు చెరువులు, కాలువలు పూడికలు తీయించాలి. వీటి పట్ల ప్రజలకు ప్రభుత్వం సరైన అవగాహన కల్పించాలి.
- చిలుకూరి శ్రీనివాసరావు,
సెల్ : 8985945506










