May 31,2022 08:51
  • ఎపి రైతు సంఘం మహాసభలో పది అంశాలపై తీర్మానం
    వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు మీటర్లు పెట్టి రైతులకు ఉరితాడు బిగించవద్దంటూ ఎపి రైతు సంఘం రాష్ట్ర మహాసభ తీర్మానించింది. కేంద్ర ప్రభుత్వం పెట్టిన షరతులకు తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అమలు చేయడం సరైంది కాదని పేర్కొంది. విద్యుత్తు మీటర్లు పెట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, జిఒ నంబరు 22ని రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. దీంతోపాటు మొత్తం పది అంశాలపై 22వ మహాసభ తీర్మానం చేసింది.

ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి : 

  • ప్రస్తుతమున్న పంటల బీమా విధానం కార్పొరేట్‌ బీమా సంస్థలకు ప్రయోజనం చేకూర్చేదిగా ఉంది. ఇందులో మార్పులు తీసుకొచ్చి సమగ్రమైన పంటల బీమాను గ్రామం యూనిట్‌గా తీసుకురావాలని మహాసభ తీర్మానించింది.
  •  పోలవరంతోపాటు పెండింగులో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ వెంటనే పూర్తి చేయాలి. దీనివల్ల 56 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టు పనుల్లో పురోగతి లేదు. వెంటనే ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి.
  • చెరకు వ్యవసాయాన్ని కాపాడాలి. చెరకు రైతుల సమస్యలు పరిష్కరించాలి. రైతులకు ప్రతి 15 రోజులకు కచ్చితంగా చెల్లింపులు చేయాలి. తొమ్మిది శాతం రికవరీ ప్రతిపాదికగా టన్నుకు రూ.4,500 మద్దతు ధర ఇవ్వాలి. మూతపడిన సహకార చక్కెర పరిశ్రమలను తెరిపించి ఆధునికీకరించాలి.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలకు గిట్టుబాటు ధరలు నిర్ణయించి ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వం లీటరుకు నాలుగు రూపాయలు బోనస్‌ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని అమలు చేయాలి. సహకార చట్టం ప్రకారం పాల ఉత్పత్తిదారులైన రైతులకు అన్ని స్థాయిల కమిటీల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి.
  • పసుపు పంటకు క్వింటాలుకు రూ.10 వేలు మద్దతు ధర ప్రకటించాలి. మార్కెఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలి. జనవరిలోనే మద్దతు ధరలు ప్రకటించాలి. ఫ్యూచర్‌ ట్రేడ్‌ మార్కెట్‌ను నిషేధించాలి. బహిరంగ వేలం పాట ద్వారానే అమ్మకాలు చేపట్టాలి.
  • స్వామినాథన్‌ సిఫారసులకు అనుగుణంగా సి2ప్లస్‌50 శాతం ఫార్ములా ఆధారంగా మద్దతు ధరలు నిర్ణయించాలి. మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలి.
  • భూ సమస్యలు పరిష్కరించాలి. భూ పంపిణీ చేపట్టాలి. రాష్ట్రంలో 60 శాతం మందికి భూమిలేదు. కేవలం ఐదు శాతం మంది చేతుల్లోనే 40 శాతం భూమి ఉంది. భూ సీలింగ్‌ చట్టాన్ని సక్రమంగా అమలు జరిపితే 12 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచవచ్చు. బలవంతపు భూ సేకరణ ఆపాలి. అటవీ హక్కుల చట్టం కింద గిరిజనులకు పట్టాలు ఇవ్వాలి.
  • ఉద్యాన పంటలకు సబ్సిడీలు కొనసాగించాలి. డ్రిప్‌, స్ప్రింక్లర్లు, పాలి హౌస్‌లకు 90 శాతం సబ్సిడీ ఇవ్వాలి. అన్ని రకాల పండ్ల తోటలకూ బీమా సౌకర్యం కల్పించాలి. కేరళ నమూనాలో సహకార ఉత్పత్తి, ప్రాసెసింగు, మార్కెట్‌ రంగాలను అభివృద్ధి పరచాలి.
  • కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసే విషయంలో సిపిఆర్‌సి చట్టాన్ని సవరించాలి. దేవాలయ భూములను సాగు చేస్తున్న కౌలు రైతులకు రక్షణ కల్పించాలి.

ఇలా... పది అంశాలపై ఈ మహాసభలో ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు.