రాయచోటి : ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల లక్ష్యాలను వంద శాతం సాధించాలని కలెక్టర్ గిరీష మండల, డివిజన్ స్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి వివిధ ప్రభుత్వ పథకాల అమలు, వాటి లక్ష్య సాధనపై మండల అధికారులు, ఆర్డీఒలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీ సర్వేలో భాగంగా లక్ష్యం మేరకు హద్దురాళ్లు పాతడంలో తహశీల్దార్లు కచ్చితంగా ప్రగతి సాధించాలన్నారు. రాయచోటి, తంబళ్లపల్లె, పెద్దమండ్యం, లక్కిరెడ్డిపల్లి మండలాలు ప్రగతిలో వెనకబడి ఉన్నాయని, వచ్చే వారంలోగా లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను అసైన్‌మెంట్ చేయడంలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఆర్‌డిఒ కూడా ఈ పనిని తగువిధంగా పర్యవేక్షణ చేయాలన్నారు. గృహ నిర్మాణాల్లో గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, పీలేరు, కె.వి.పల్లి, రాజంపేట మండలాలు ప్రగతిలో వెనుకబడి ఉన్నాయన్నారు. ప్రతివారం లక్ష్యాలను నిర్దేశించామని, తదుపరి వారానికి తప్పనిసరిగా 10 శాతం ప్రగతి ఉండాలన్నారు. సమావేశంలో డిఆర్‌ఒ సత్యనారాయణ, రాజంపేట సబ్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్, రాయచోటి, మదనపల్లి ఆర్‌డిఒలు రంగస్వామి, మురళి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపిడిఒలు పాల్గొన్నారు.










