Nov 07,2021 06:47

    ఒక ఆలోచన కోట్లాది ప్రజలు నడిచే మార్గాన్ని మార్చగలదు. ఒక త్యాగం మరెందరి ఆలోచనలనో ప్రభావితం చేయగలదు. ఒక పోరాటం తరతరాలను స్ఫూర్తిపథాన నడిపించగలదు. ''మానవ పురోగమన మార్గాలు తెరువగా/ లెనిన్‌ తపస్సు, / స్టాలిన్‌ సేద్యం/ జ్వలించిన, ఫలించిన సముజ్జ్వల తేజం/ యునైటెడ్‌ సోవియట్‌ సోషలిస్ట్‌ రాజ్యం'' అంటాడు మహాకవి శ్రీశ్రీ. 1917 నవంబర్‌లో రష్యా కార్మికవర్గం వీరోచిత తిరుగుబాటు చేసిన ఆ పది రోజుల్లో ప్రపంచం ఎంతగా కుదిపివేతకు, మౌలిక మార్పులకు గురైందో... 'ప్రపంచాన్ని కుదిపేసిన ఆ పదిరోజుల' ప్రత్యక్ష కథనాన్ని అమెరికన్‌ పాత్రికేయుడు జాన్‌ రీడ్‌ సజీవంగా ఆవిష్కరించాడు. నిన్నటి నెత్తుటి మరకలు, గాయాల గురుతులు, విజయగీతికలు, పోరాటాలు, ఉద్యమాల జ్ఞాపకాలు, త్యాగాల చరితలు ప్రపంచ విప్లవోద్యమ చరిత్రకు ఆనవాళ్లు... నాటికి నేటికీ... భవిష్యత్తరాలకున్నూ. దోపిడీ పీడనలు లేని సమ సమాజం ఒక స్వప్నం కాదని, మానవ సమాజ చారిత్రక గమనంలో అదొక సత్యవర్తనమని రుజువు చేసిన విప్లవం అది. ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గాలకు, చైతన్య శీలతకు... సోషలిజానికి, కమ్యూనిజానికి బాటలు వేసిన విప్లవపథం అది. పండుటాకులా మారిన పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయంగా సోషలిజాన్ని నిలిపింది సోవియట్‌ విప్లవ స్ఫూర్తి. స్వప్నం ఫలించి సత్యమై సాక్షాత్కరిస్తే, చైతన్య ప్రభావాలు ప్రవాహమై విస్తరించడం అత్యంత సహజమైన పరిణామం.
     భారతీయ సమాజం మీద, వివిధ రంగాల మీద సోవియట్‌ విప్లవ స్ఫూర్తి చూపించిన ప్రభావం చాలా విస్తారమైనది. విస్తృతమైనది, విశిష్టమైనది. నాటి త్యాగనిరతి, పోరాట పటిమ, ఉజ్వలచరిత అప్పుడూ ఇప్పుడూ కమ్యూనిస్టుల సొంతం. తెలుగునాట అదే విప్లవ స్ఫూర్తి దశదిశలా విస్తరించడానికి దోహదం చేసింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉవ్వెత్తున ఎగసిపడటానికి, నిజాం నిరంకుశ పాలనను తుదముట్టించడానికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఈ విప్లవ స్ఫూర్తి వెన్నెముకగా నిలిచింది. ఈ పోరాటంలో ఎందరో తల్లుల గుండెకోతలున్నాయి. కళ్లు చెదిరే త్యాగాలున్నాయి. పాలిచ్చే బిడ్డలను పంటపొలాల్లో వదిలేసి ఆయుధాలు పట్టిన వీరమాతలు, ధీరవనితలు కొందరైతే, తమ బిడ్డల పోరాటంలో భాగం పంచుకొన్నవారు మరికొందరు. 'కన్నీళ్లల్లో కరిగే కొవ్వొత్తులం/ లోకమంతా అమ్మ రూపమే, నీ ఆకలి మా ఆర్తనాదమే' అంటూ వీరగాథలను చనుబాలతో రంగరించి, విప్లవపథానికి మార్గాన్ని చూపిన ఎందరో అమ్మల త్యాగాలు తెలుగునాట విప్లవ జ్యోతులై వెలుగుతూనే వున్నాయి. ముఖ్యంగా విప్లవ నేపథ్యంలో వచ్చిన సోవియట్‌ సాహిత్యం... తెలుగు సాహిత్య సృజనను అత్యంత ప్రభావితం చేసింది. ముఖ్యంగా 'అమ్మ' వంటి నవలలు చదివి స్ఫూర్తి పొందిన విప్లవ పుత్రులు ఎందరో వున్నారు. ఆ విప్లవ ప్రభావం ఎంత వరకూ వచ్చిందంటే... తమ పిల్లలకు లెనిన్‌, స్టాలిన్‌ అని పేర్లు పెట్టడం దగ్గర నుంచి తమ ఊర్లలోని పేటలకు, నగరాలకు సైతం వారి పేర్లు పెట్టడం వంటివి ఆ స్ఫూర్తిలో భాగమే.
    భారతదేశంలో ఆకలి కేకలు పెరుగుతున్నాయి. ప్రపంచ ఆకలి సూచీలో గతేడాది 94వ స్థానంలో వున్న భారత్‌... ఈ ఏడాది 101వ స్థానానికి దిగజారిపోయింది. విద్య, వైద్యం అడుగంటి పొయ్యాయి. అర్థాకలితో బతకాల్సిన పరిస్థితి వస్తోంది. దీనికి విధానాలు మారడం తప్ప వేరే పరిష్కారంలేదు. మన దేశం మాత్రమే కాదు, ప్రస్తుతం పెట్టుబడిదారీ ప్రపంచం యావత్తూ పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయివుంది. ఈ సంక్షోభానికి కారణం నయా ఉదారవాద ఆర్థిక విధానాలేనన్నది సుస్పష్టం. అందుచేత ఈ విధానాలను మార్చడమే ప్రస్తుత కర్తవ్యం. అటువంటి మార్పు ఎవరో వచ్చి చేస్తారని సామాన్య ప్రజలు, కష్టజీవులు ఎదురుచూస్తూ కూర్చోకుండా ప్రత్యక్షంగా కదిలి కొత్త చరిత్రను లిఖించడానికి కదలాలి. అలా వారిని కదిలించే విధంగా... మన భవితను మనమే లిఖించుకోగలమన్న చైతన్యవంతమైన స్ఫూర్తినిచ్చి, కర్తవ్యాన్ని బోధించిన స్ఫూర్తి కిరణం... నవంబర్‌ విప్లవ దినోత్సవం. ఆ విప్లవ స్ఫూర్తి, చైతన్య ప్రేరణ, దిక్సూచిగా ప్రపంచమంతటా సమసమాజం ఆవిష్కృతమయ్యేంత వరకూ సజీవంగానే వుంటుంది. 1917 నవంబర్‌లో రగిల్చిన ఈ జ్వాలను ఆర్పివేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ స్ఫూర్తి నిత్యప్రకాశితం... జగజ్జ్వలితం.