Mar 12,2022 06:59


వెనుక దగా... ముందు దగా.. కుడి, ఎడమల దగా... అని అప్పుడెప్పుడో మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లుగా నేడు ఎక్కడ చూసినా మార్కెట్లో దగా, మోసంతో కూడిన కల్తీ వ్యవస్థలు రాజ్యమేలుతున్నాయి. కార్పొరేట్‌ హంగులతో ధగాధగా మెరుస్తూ చూపరులను అట్టే ఆకట్టుకునే క్లాత్‌ షాపుల షోరూముల ముందు 30%, 50% ఆఫర్లు వున్నాయని బోర్డులు కనిపిస్తాయి. లోపలికెళ్లి ఆశతో బట్టలు కొని ఇంటికొచ్చి నీళ్లలో వేయగానే చిరిగిపోతున్నాయి. మెడికల్‌ షాప్‌లనందు కొనేటటువంటి కొన్ని మందులను ఆదరబాదరగా కొంటూ ఇంటికొచ్చి చూసేసరికి వాటి మీద ఎక్స్‌పైరీ డేట్‌ అయిపోయివుంటుంది. మామూలు తూకాలతో పాటు ఎలక్ట్రానిక్‌ కాటాలనందు సైతం సరకులు, ధాన్యం, ఇతరత్రా మసాలా దినుసులు కొనేటప్పుడు కిలోకు యాభై గ్రాముల నుంచి వంద గ్రాముల వరకు తేడా వస్తున్నది. ఐదు సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు గ్యారెంటీ, వారెంటీలతో కొంటున్న వస్తువులు రెండు మూడు సంవత్సరాలకే పాడైపోతున్నాయి. ఇలాగే... అన్ని రకాల నిత్యావసర వస్తువులనందు కల్తీ చోటుచేసుకుంటున్నది. కల్తీ విత్తనాలతో పండిస్తున్న పంటలు చేతికి రాకుండానే రైతులకు నష్టాలను కలిగిస్తున్నాయి. విమానాలలో భారీ రేటుతో టిక్కెట్లు కొని విమానాశ్రయాలకు చేరుకున్న తరువాత బస్సులలాగా విమానాలు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మూడు, నాలుగు గంటలు ఆలస్యంగా వస్తున్నాయి. బస్సులు, రైళ్లు అయితే... ఎప్పుడొస్తాయో.. మరెప్పుడు ఆగిపోతాయో తెలియని దుస్థితి నెలకొన్నది. గ్రామ పంచాయితీలనందు, మున్సిపాలిటీలనందు వేసేటటువంటి సిమెంట్‌ రోడ్లు కొద్దిపాటి వర్షాలకు ఓ స్థాయి రద్దీకి నాలుగైదు నెలలకే పాడైపోతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులలోనే కాకుండా భారీ ఫీజులు తీసుకుంటున్న ప్రైవేట్‌ ఆస్పత్రులనందు, కార్పొరేట్‌ ఆస్పత్రులనందు వైద్యం వికటించి ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
    హౌటళ్లలో తినే టిఫిన్‌, సేవించే టీ, కాఫీలనందు కూడా నాణ్యత లోపిస్తున్నది. ఇటువంటి అనేక మోసాల నుంచి కాపాడడానికి వినయోగదారులే రారాజులు అంటూ... ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రం అని కూడా భావించి 1985-1986ల మధ్య నాటి కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని తీసుకొచ్చింది. అంతకుముందే అనేక దేశాలలో ఈ వినియోగదారుల చట్టం అమలులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు చైతన్యవంతులై వినియోగదారుల సంఘాలను భారీ ఎత్తున ఏర్పాటు చేసుకొని తీవ్రస్థాయిలో ఉద్యమం నడిపినందుకు ఐక్యరాజ్యసమితి మార్చి 15ను అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం కింద అప్పట్లోనే గుర్తించింది. అయితే... దశాబ్దాలు గడుస్తున్నా వినియోగదారుల పరిరక్షణ చట్టం గురించి మన దేశంలో నేటికీ సామాన్యులకు సరైన అవగాహన కలగలేదు. ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టు క్యాంపస్‌నందు లేదా మరో ముఖ్యమైన ప్రదేశంలో పదవీ విరమణ పొందిన జిల్లా న్యాయమూర్తుల చేత వినియోగదారుల ఫోరాలు నడుస్తున్నాయి. రాష్ట్ర స్థాయి ఫోరానికి పూర్వపు హైకోర్ట్‌ న్యాయమూర్తిని ప్రభుత్వాలు నియమిస్తున్నాయి. ఢిల్లీలో జాతీయ వినియోగదారుల ఫోరం వుంది. దీనికి రిటైర్డ్‌ సుప్రీంకోర్ట్‌ జడ్జీ నేతృత్వం వహిస్తుంటారు. ఫోరాలకు ఛైర్మన్లతో పాటు సీనియర్‌ న్యాయవాదులను, సామాజిక మేధావులను కొంతమందితో కలిపి ఫోరం సభ్యులుగా ప్రభుత్వాలు నియమిస్తున్నాయి. వీరందరికీ గౌరవవేతనం ఇస్తున్నారు. సమాచార హక్కు చట్టానికి అతి తక్కువ సమయంలోనే ప్రాచుర్యం వచ్చింది. వినియోగదారుల ఫోరాలకు ఆ స్థాయిలో గుర్తింపు రాలేదు. ఇందుకు ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పాటు వినియోగదారుల చైతన్య రాహిత్యం కూడా దోహదం చేస్తున్నదని చెప్పవచ్చు. ఇలా నిద్రావస్థలో ప్రజలు వున్నందువల్ల మోసం చేస్తున్న సంస్థల నుంచి కంపెనీల నుంచి పరిహారం సకాలంలో సరైన విధంగా పొందలేకపోతున్నారు. ప్రతి పౌరుడూ వినియోగదారుడే అయినందున వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ సదస్సుల ద్వారా ప్రజలకు వివరించి త్వరలో మరో వినియోగదారుల ఉద్యమానికి 'లీగల్‌ సర్వీసెస్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ కౌన్సిల్‌' ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టబోతున్నాము.
                    కె.ధనలక్ష్మి- రచయిత లీగల్‌ సర్వీసెస్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ కౌన్సిల్‌ సెక్రటరీ