Oct 25,2020 08:10

'దుర్గాదేవికి ఇచ్చే గౌరవాన్ని దేశంలోని మహిళలకూ ఇవ్వాలి' అంటారు ప్రముఖ మహిళా జర్నలిస్టు, 'ది వైర్‌' వెబ్‌సైట్‌ సంపాదకులు అర్ఫా ఖానుమ్‌ షెర్వానీ. ఆ గౌరవం నేడు మహిళలకు దక్కుతోందా? అన్నది ఒక ప్రశ్న. కుటుంబంలో శ్రమ విభజన స్త్రీలకు సంతానాన్ని కనే ప్రకృతిసిద్ధ లక్షణంతో మొదలైంది. ఆ క్రమంలో స్త్రీ పిల్లల పెంపకం, కుటుంబ నిర్వహణలో నిమగమైతే, పురుషుడు వ్యవసాయం, పశుపోషణ వంటి పనులలో నిమగమయ్యాడు. ఉత్పత్తి పెరిగి, మిగులు ఏర్పడ్డాక కొందరు ఆ మిగులుపై పెత్తనం సంపాదించారు. అలా వ్యక్తిగత ఆస్తి ఏర్పడింది. నిజానికి స్త్రీ పురుషుల మధ్య అసమాన పంపకం ఇక్కడే మొదలైంది. అది పురుషుడి వ్యక్తిగత ఆస్తిగా మారింది. తన ఆస్తి తన వారసులకే చెందాలంటే... తన ద్వారానే జన్మించిన పిల్లలు కావాలి. తన పిల్లలను సాకేందుకు ఓ తల్లి కావాలి. ఆ తల్లిని కూడా ఆస్తిగా చూడటం మొదలైంది. దీంతో స్త్రీ పురుషుల మధ్య అప్పటివరకూ వున్న సమానత్వం స్థానే 'ఇది నాది' అనే భావన పెరిగింది.. భార్య పైన, కుటుంబం పైనా పురుషాధిపత్యం పెరిగింది. 'కుటుంబంలో భర్త బూర్జువా, భార్య కార్మికురాలు' అంటాడు ఏంగెల్స్‌ 'కుటుంబం- వ్యక్తిగత ఆస్తి- రాజ్యాల పుట్టుక' గ్రంథంలో. ఈ పరిణామ క్రమంలో స్త్రీ కుటుంబానికి పరిమితమై, భర్తకు బానిసయింది. 'కుటుంబంలో పైకి కనిపించకుండా వున్న బానిసత్వమే మొదటి సంపద' అని ఆర్థికవేత్తలు చెప్పినట్టుగా... భార్య అనే ఆస్తి పైన కూడా ఆధిపత్యం సంపాదించాడు పురుషుడు. ఈ క్రమంలో భార్యను తన గుప్పెట్లోనే వుంచుకోవడానికి పెట్టిన నియమ నిబంధనలు... కులవ్యవస్థ, మతాచారాల మేళవింపులో మనువాదంగా వికృతరూపం తీసుకున్నాయి. వాస్తవానికి పురుషునికి సమాన స్థాయిలో వున్న స్త్రీపై... ఆర్థికంగా, సామాజికంగా తన ఆధిపత్యం ప్రదర్శించాడు. తద్వారా సమాజం మాతృస్వామ్యం నుంచి పురుషాధిపత్యం వైపునకు మళ్లింది.
స్త్రీ- అంటే ప్రకృతి. ఈ ప్రకృతిలో గ్రామదేవతగా స్త్రీ రూపం కొలువయ్యింది. నాటి నుండి స్త్రీ ఆదిశక్తిగా పూజలందుకొంది. మొదట గ్రామ దేవతలుగా పూజాదికాలు అందుకొంది. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో... వివిధ పేర్లతో, వివిధ రూపాలలో ప్రతిష్టించబడింది. కులాలకు అతీతంగా ఈ దేవతామూర్తులకు జాతరలు నిర్వహించేవారు. కాలక్రమంలో ఈ గ్రామ దేవతలే ఆదిశక్తికి ప్రతిరూపాలుగా మారారు. అంతేతప్ప పురుషుడు ఏ క్రమంలోనూ తొలుత పూజలందుకొన్నది లేదు. బ్రాహ్మణవాదం పెరిగిన తర్వాత... మేము చెప్పిందే వేదం....మేము పలికిందే మంత్రం... చేసిందే తంత్రం అన్నట్టుగా సమాజాన్ని శాసించారు. అప్పటివరకూ అన్నికులాలకు దర్శనమిచ్చిన గ్రామ దేవత.. ఆదిశక్తిగా, శివుడి భార్య పార్వతీదేవి అవతారంగా మారిపోయింది. పురుష దేవతలు గర్భగుడులను ఆక్రమించుకున్నారు. తక్కువ కులాలుగా చెప్పబడేవారికి అప్పటివరకూ లేని ఆటంకాలు, అవరోధాలు ఎదురయ్యాయి. మనుస్మృతిని భుజానికెత్తుకున్న వర్గం సృష్టించిన కట్టుబాట్లు స్త్రీకి బంధనాలుగా మారాయి. ఈ మనువాదాన్ని తలకెత్తుకున్న కాషాయదళం హిందూ సంస్కృతి పేరుతో మహిళలను అత్యంత అమానుషంగా చూస్తున్నది. 'బాల్యంలో స్త్రీలు తండ్రి ఆధీనంలోనూ, యవ్వనంలో భర్త ఆధీనంలో, భర్త చనిపోయిన తర్వాత కుమారుల ఆధీనంలోను జీవించాలి. ఆమెకు స్వాతంత్య్రం వుండరాదు' అని మనువు చెబుతాడు. హిందూత్వం ఊహిస్తున్న సమాజంలోని సామాజిక నిర్మాణం ఇది. ఈ సిద్ధాంతాన్ని అణువణువునా జీర్ణించుకున్న కాషాయదళం మహిళల పట్ల వ్యవహరిస్తోన్న తీరు బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్లకు కట్టినట్టు కనబడుతోంది.
ప్రధాని మోడీతో మొదలుబెట్టి హిందుత్వ వాదులంతా విజయదశమి సమయంలో స్త్రీని ఆదిపరాశక్తి, దేవత అంటూ పొగుడుతున్నారు. మరోపక్క మనువాదాన్నే మన రాజ్యాంగంగా ఏ విధంగా అమలు చేయాలా అని కుట్రలు పన్నుతున్నారు. స్త్రీకి స్వాతంత్య్రం కలిగివుండే అర్హత లేదంటుంది మనువాదం. విజయదశమి నాటి ఆదిపరాశక్తి ప్రపంచాన్ని కాపాడే తల్లి. ఆ మర్నాటి నుండీ అదే స్త్రీ... తన రక్షణ కోసం పురుషులపై ఆధాపడాలని చెప్తుంది మనువాదం. హిందుత్వ శక్తుల ఈ కపట నాటకాన్ని మహిళాలోకం గ్రహించగలిగితే ఆదిపరాశక్తి అసలు శక్తి ఏమిటో హిందుత్వ మనువాదులకు చవిచూపగలుగుతారు. అది జరిగిన రోజు అసలైన విజయదశమి!