Feb 24,2023 22:03

మాట్లాడుతన్న ఇన్‌ఛార్జి డీఎస్పీ యశ్వంత్‌

         ప్రజాశక్తి-హిందూపురం  పట్టణంలోని ప్రధాన రహదారి కూడల్లో నూతన విగ్రహాల ఏర్పాటుకు ఇక నుంచి అనుమతులు లేవని కమిషనర్‌ వెంకటేశ్వరరావు, ఇన్‌ఛార్జి డీఎస్పీ యశ్వంత్‌ తెలిపారు. శుక్రవారం రాత్రి పట్టణంలోని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పట్టణంలో ఇటీవల కాలంలో అనుమతులు లేకుండా విగ్రహాల ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. వాటిని అడ్డుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తే ఆందోళనలు చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఇకపై పురపాలక సంఘ వ్యాప్తంగా ప్రధాన రహదారుల్లో ఎలాంటి విగ్రహాలు ఏర్పాటు చేయడానికి అనుమతులు లేవన్నారు. నిబంధనలను అతిక్రమించి విగ్రహాలు ఏర్పాటుకు ప్రయత్నం చేస్తే చర్యలు తీసుకోవడం తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో తహశీల్దార్‌ సౌజన్య, వన్‌టౌన్‌, టూటౌన్‌ స్టేషన్‌ సిఐలు ఈరన్న, వెంకటేశ్వర్లు, పురపాలక సంఘం పట్టణ ప్రణాళిక అధికారి ఆనంద్‌కుమార్‌, డిప్యూటీ తహశీల్దార్‌ ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.