- సిపిఎం ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కాశీనాథ్ డిమాండ్
ప్రజాశక్తి - విజయవాడ : విజయవాడ నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలు చర్చించి పరిష్కారం చూపాలని సిపిఎం ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దోనేపూడి కాశీనాధ్ డిమాండ్ చేశారు. ఈనెల 31న విఎంసి కౌన్సిల్ సమావేశం జరగనున్న నేపథ్యంలో శుక్రవారం గవర్నర్‌పేటలోని శ్రీశ్రీ భవన్‌లో ఆపార్టీ ఫ్లోర్‌లీడర్ బోయి సత్యబాబుతో కలిసి కాశీనాథ్ మీడియాతో మాట్లాడారు. ప్రజాసమస్యల పరిష్కార వేదికగా కౌన్సిల్‌ను నిర్వహించాలని కోరారు. 14వ, 15వ ఆర్థిక సంఘాల నిధుల దగ్గర నుంచి స్ట్రామ్ వాటర్ డ్రైనేజి నిధుల వరకు వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి విఎంసికి మంజూరైన రూ.621 కోట్లను ఏళ్ల తరబడి విడుదల చేయడంలేదని విమర్శించారు. దీంతో నగరంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపట్టాల్సిన పనులకు సైతం విఎంసి సాధారణ నిధులను భారీగా ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో 73,74 రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక సంస్థలకు నిధులు- విధులు బదలాయింపు అనేవి నీరుగారిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విఎంసికి 14వ ఆర్థిక సంఘం ద్వారా రూ.36 కోట్లు, 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.154 కోట్లు, ఎపి గ్రాంట్ నుంచి రూ.140 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసినా విడుదల చేయలేదన్నారు. అలాగే స్ట్రామ్ వాటర్ డ్రైనేజికి రూ.289 కోట్లను మంజూరు లేదన్నారు. జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం, 14వ ఆర్థిక సంఘం నిధులతో నగరంలో చేపట్టిన వివిధ పనులకు రూ.150 కోట్ల మేర బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందన్నారు. వీటిల్లో రూ.80 కోట్ల మేర బిల్లులను విఎంసి సాధారణ నిధులను ఇవ్వడం శోచనీయమన్నారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా విఎంసికి రూ.186 కోట్లు మంజూరు కాగా, వాటిలో రూ.150 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, మరో రూ.36 కోట్లు విఎంసికి రావాల్సి ఉందని అన్నారు. అలాగే 15వ ఆర్థిక సంఘం నుంచి మంజూరైన రూ.155 కోట్లలో కేవలం రూ.20 లక్షలు నిధులు విడుదలయ్యాయని పేర్కొన్నారు. మిగిలిన నిధులను విడుదల చేయడం లేదన్నారు. ఎపి గ్రాంట్ నుంచి రూ.150 కోట్లు మంజూరు కాగా, వాటిలో కేవలం రూ.7 కోట్లు మాత్రమే జమయ్యాయని, మిగిలిన రూ.143 కోట్ల పరిస్థితి ఏమిటో అర్థంకావడంలేదన్నారు. స్ట్రామ్ వాటర్ డ్రైనేజి పథకానికి కేంద్రం రూ.461 కోట్లు కేటాయించగా, వీటిలో రూ.172 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. మిగిలిన రూ.289 కోట్ల పరిస్థితి ఏమిటో తెలియడంలేదన్నారు. ఈపనులపై ప్రభుత్వం నుంచి విఎంసికి అనుమతి రావాల్సి ఉందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరంలో ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రహదారులు దెబ్బతిన్నాయని, సరైన డ్రైనేజి వ్యవస్థ లేక చిన్నపాటి వర్షానికి సైతం పలు ప్రాంతాలు తటాకాలుగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వర్షాలకుతోపాడు పారిశుధ్యం లోపించడంతో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి విషజ్వరాలు ప్రబలి ప్రతి ఇంట్లో ఒకరు చొప్పున జ్వర పీడితులు ఉండే పరిస్థితి ఏర్పడిందన్నారు. అయినా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంగానీ, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సదుపాయం కల్పించడంగానీ చేయకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులు కటకిటలాడుతున్నాయన్నారు. విఎంసి ఉద్యోగులకు రూ.45 కోట్ల మేర ఉద్యోగ విరమణ సౌకర్యాలు నేటికీ ఇవ్వలేదన్నారు. ఇటీవల పకీరుగూడెం, వన్‌టౌన్ తదితర ప్రాంతాల్లో అగ్నికి ఆహుతైన గృహాల బాధితులకు టిడ్కో గృహాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. సిపిఎం ఫ్లోర్‌లీడర్ బోయి సత్యబాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్యయుతంగా కౌన్సిల్‌ను నిర్వహించాలని, లేనట్లయితే ప్రజా సమస్యల ప్రాతిపదికన అధికార వైసిపిని నిలదీస్తామని హెచ్చరించారు.










