Jan 21,2022 08:15
  • ఎఇఒల ప్రమోషన్లలో మరో ట్విస్ట్‌
  • 15 మందిలో ఐదుగురినే వెనక్కి పంపడంపై చర్చ

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : వ్యవసాయ విస్తరణాధికారుల (ఎఇఒ) ప్రమోషన్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. హైకోర్టు వ్యాజ్యం నేపథ్యంలో వ్యవసాయాధికారులుగా (ఎఒ) పదోన్నతులు పొందిన నాన్‌-ఐసిఎఆర్‌ ఎఇఒలలో ఐదుగురి ప్రమోషన్లు రద్దు చేసి తిరిగి ఎఇఒలుగా రివర్షన్‌ ఇస్తూ వ్యవసాయ కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వులు ఆచరణకు నోచుకోలేదు. మెమో జారీ చేసి వారం రోజులు దాటినా సదరు అధికారులు విధులో చేరలేదు. కొంత మంది శెలవులు పెట్టారని, మరికొందరు ఇతర కారణాలు చూపించి డ్యూటీలో చేరలేదని సమాచారం. రివర్షన్‌ ఇచ్చిన ఎఇఒల చేరికలపై బుధవారం కమిషనర్‌, సంబంధిత జిల్లాల జెడిఎలతో సమీక్షించారని తెలిసింది. రివర్షన్‌ అయిన ఐదుగురు ఎఇఒలూ ఇప్పటి వరకు వారికి కేటాయించిన ప్రదేశాల్లో విధుల్లో చేరకపోవడంపై వ్యవసాయశాఖలో చర్చ జరుగుతోంది. ఎలాగొలా రివర్షన్‌ నుండి బయట పడేందుకు అన్ని విధాలా, ప్రభుత్వ స్థాయి వరకు ప్రయత్నాలు సాగుతున్నాయని సమాచారం. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసిఎఆర్‌) గుర్తింపు కలిగిన విద్యాసంస్థల్లో పట్టాలు పొందిన అభ్యర్ధులనే వ్యవసాయశాఖలో నియమించాలని ప్రభుత్వ ఉత్తర్వులున్నాయి. కొన్నేళ్లల్లో ఆ ఉత్తర్వులకు విరుద్ధంగా నాన్‌-ఐసిఎఆర్‌ అభ్యర్ధులతో పలు నియామకాలు జరిగాయి. ఈ వివాదం కొనసాగుతుండగానే, స్సెషల్‌ కేస్‌ కింద 15 మంది నాన్‌-ఐసిఎఆర్‌ ఎఇఒలకు ఎఒలుగా 2020లో సర్కారు ప్రమోషన్లు ఇచ్చింది. దానిపై కొందరు హైకోర్టుకెళ్లగా ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేయాలని కోర్టు స్టే ఇచ్చింది. కోర్టు స్టే ఉండగానే జాయినింగ్‌ ఆర్డర్స్‌ ఇవ్వగా వారందరూ విధుల్లో చేరారు. కోర్టు ధిక్కరణ కింద న్యాయస్థానం వ్యవసాయశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, కమిషనర్‌ను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నెల 7న వారిద్దరూ హాజరై లోపాలను సరి చేస్తామని హామీ ఇచ్చారు. కోర్టులో ఈ నెల 21న తిరిగి విచారణకు రానుంది. ప్రమోషన్లు ఇచ్చిన 15 మందిలో ఐదుగురిని రివర్స్‌్‌ చేస్తూ ఈ నెల 11న కమిషనర్‌ మెమో ఇచ్చారు. ప్రమోషన్లు ఇచ్చిన 15 మందిలో కేవలం ఐదుగురిని సాంకేతిక కారణాలు చూపించి రివర్స్‌ చేసి మిగిలిన పది మందిని కొనసాగించడంపై చర్చ జరుగుతోంది. రివర్షన్‌ అయిన వారు సైతం ఈ వాదనే చేస్తున్నారు.