Dec 17,2022 19:03

పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యుత్‌ సిబ్బంది

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ : విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని ఇఇ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. విద్యుత్‌ పొదుపు వారోత్సవాల్లో భాగంగా రాజంపేట డివిజన్‌ విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్‌ శాఖ సిబ్బంది డివిజన్‌ కార్యాలయం నుంచి పాత బస్టాండ్‌ కూడలి, ఆర్‌టిసి బస్టాండ్‌ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మనం వాడే విద్యుత్‌ పరికరాలు త్రీ స్టార్‌ రేటింగ్‌ పైన ఉన్న వాటిని వాడాలని, ఎల్‌ఇడి లైట్లు వాడాలన్నారు. అవసరం లేనప్పుడు స్విచ్‌ ఆఫ్‌ చేయాలని తెలిపారు. ఎసిలను రిమోట్‌తో ఆఫ్‌ చేసిన తరువాత స్విచ్‌ కూడా ఆఫ్‌ చేయాలని తెలిపారు. ఇలా చేయటం ద్వారా విద్యుత్‌ బిల్లును తగ్గించుకుంటూ భావితరాలకు మిగులు విద్యుత్తును అందించుటకు వీలవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యుత్‌ డిఇఇలు సురేంద్రనాథ్‌, మొరలిధర్‌రెడ్డి, ఎఎఒ గంగయ్య, ఎఇలు చంద్రశేఖర్‌, ఉమాపతి, రామకృష్ణ, షఫీ, ఈశ్వర్‌ రాజు, విజయకుమార్‌ రెడ్డి, చలపతి, యోగానంద, బాలకృష్ణ, విద్యుత్‌ సిబ్బంది పాల్గొన్నారు.