Feb 24,2023 21:57

విద్యుత్‌ కోతలతో ఎండుతున్న వేరుశనగ పంట

       మడకశిర : అసలే వేసవికాలం ఆపై అప్రకటిత విద్యుత్‌ కోతలు వెరసి రబీ సీజన్లో బోరుబావుల కింద రైతుల సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయి. విద్యుత్‌ సరఫరా సక్రమంగా అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వర్షాకాలంలో కురిసిన వర్షాలకు బోరుబావుల్లో నీరు పుష్కలంగా రావడంతో మడకశిర నియోజకవర్గం వ్యాప్తంగా రబీపంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గత ఖరీఫ్‌లో అధిక వర్షాలు మూలంగా పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులు రబీపై ఆశలో పెట్టుకున్నారు. వేలాది రూపాయలు అప్పులు చేసి వేరుశనగ, మొక్కజొన్న, రాగి, వరి తదితర పంటలను సాగు చేశారు. రబీ ప్రారంభంలో వ్యవసాయానికి 7 గంటల పాటు రెండు విడతలుగా విద్యుత్‌ను అందించేవారు. దీంతో పంటలు బాగా ఉండేవి. గత నెల రోజుల నుంచి వ్యవసాయానికి ఉన్న ఫలంగా విద్యుత్‌ కోతలు విధించారు. వ్యవసాయానికి ఏడు గంటల పాటు పగటి వేళల్లో విద్యుత్‌ అందించాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ మడకశిర, గుడిబండ ప్రాంతాల్లో ఇది అమలుకు నోచుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగటి వేళల్లో నాలుగు గంటలు, రాత్రి వేళల్లో మూడు గంటలపాటు సరఫరా చేస్తున్నామని చెబుతున్నా గత 15 రోజుల నుంచి ఇది సక్రమంగా అమలుకావడం లేదు. వేళాపాలాలేని విద్యుత్‌ కోతలతో పంటలు ఎండుదశకు చేరుకుంటున్నాయి. విద్యుత్‌శాఖ అధికారులు మాత్రం ఓవర్‌లోడ్‌ వల్లనే విద్యుత్‌ సమస్య ఏర్పడుతోందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఖరీఫ్‌తో పోలిస్తే రబీలో పంటల సాగు విస్తీర్ణం తక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఓవర్‌లోడ్‌ ఎలా అవుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. విద్యుత్‌ శాఖ అధికారులు దీనిపై స్పందించి పూర్తి స్థాయిలో పగటిపూట ఏడు గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.
కోతలు అధికం
తిప్పన్న, మండలపల్లి గ్రామం,
గుడిబండ మండలం.

ఇటీవల విద్యుత్‌ కోతలు అధికం అయ్యాయి. రబీ ప్రారంభంలో 7 గంటల పాటు పగటి విద్యుత్‌ సరఫరా చేశారు. గత 15 రోజులుగా మా గ్రామంలో వ్యవసాయానికి విద్యుత్‌ ఎప్పుడు వస్తుందో... ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను విద్యుత్‌ అధికారుల దష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదు. పంట చేతికొచ్చే సమయంలో విద్యుత్‌ కోతలతో నష్టపోతున్నాం.
అధిక లోడ్‌తోనే సమస్య
సుబ్రమణ్యప్రసాద్‌,
విద్యుత్‌ శాఖ ఏడీ.

ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయానికి 7 గంటల విద్యుత్‌ అందిస్తున్నాం. కొన్నిచోట్ల గతంలో ఉన్న విద్యుత్‌ బోర్ల కంటే అధికంగా రైతులు మోటార్లు ఏర్పాటు చేసుకున్నారు. దీనివల్ల ఓవర్‌లోడ్‌ అయ్యి కొన్ని ప్రాంతాలకు విద్యుత్‌సరఫరా నిలిచిపోతోంది. ఓవర్‌ లోడ్‌ ఉన్న గ్రామాలను గుర్తించి ఈ సమస్య పరిష్కారానికి అదనంగా విద్యుత్‌ లైన్లు ఏర్పాటుచేస్తాం. లోవోల్టేజ్‌ సమస్య పరిష్కరించి వ్యవసాయానికి 7 గంటల విద్యుత్‌ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం.